మెదక్ కలెక్టరేట్: ఒక్క ఎస్‌ఎంఎస్‌తో ఓటరు నమోదు సమాచారం పొందవచ్చునని కలెక్టర్ ప్రతిమాసింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1950 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేసి ఓటర్లు తమ ఓటు నమోదు సమాచారం తెలుసుకోవచ్చునని తెలిపారు. ఈనెల 3వ తేదీతో సర్ ప్రక్రియ ముగియనున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఎన్నికల గుర్తింపు కార్డు నంబర్‌ను టైప్ చేసి 1950 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపించి వివరాలు పొందవచ్చన్నారు. మూడు రోజులు వ్యవధి మాత్రమే ఉన్నందున అర్హులైన ఓటర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవసరమైతే సవరణలు, నమోదు ప్రక్రియలను సమయానికి పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఓటు హక్కు విలువను గుర్తించి తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.
తూప్రాన్: విద్యుత్‌శాఖ డీఈగా దశరథ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన గరుత్మంతరాజు మేడ్చల్ జిల్లా హబ్సిగూడలోని విద్యుత్ శాఖ కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈసందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నూతనంగా పదోన్నతిపై ఇక్కడికి వచ్చి పదవీ బాధ్యతలు స్వీకరించిన దశరథ్‌ను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.
హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ సర్వేను సక్రమంగా నిర్వహించి రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శాలిపేటలో భూభారతి సర్వేను నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్డీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూభారతి రీ సర్వే ద్వారా అందరి రైతుల పొలాల హద్దులు, ఇతర సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. సమావేశంలో సర్పంచ్ పోశెట్టి, మండల రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
చిలప్‌చెడ్(నర్సాపూర్): గ్రామాల్లో వందశాతం పారిశుద్ధ్యం సాధించాలంటే విద్యార్థులే కీలకపాత్ర పోషిస్తారని డీఎల్‌పీఓ సురేశ్‌బాబు అ న్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఫైజాబాద్ పంచాయతీని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వారికి స్వచ్ఛత కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు స్వచ్ఛతపై తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రజలు చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి కార్మికులకు అంజేయాలని, వారు సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులో పారబోయాలన్నారు. అధికారులు, పాలకులు, ప్రజలతోనే గ్రామాల్లో వందశాతం పారిశుద్ధ్యం సాధ్యమవుతుంద న్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఎంపీఓ మునిరుద్దీన్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలసదన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల సంరక్షణకు తోడ్పడాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. న్యాయ పరమైన విషయంలో ఉచిత సాయం అందిస్తామని తెలిపారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు.


