చేగుంట(తూప్రాన్): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ సూచించారు. బుధవారం చందాయిపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ వానాకాలం వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నందున రైతులు ఆరుతడి పంటలైన పప్పు, చిరు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజల పంటలను సాగు చేయాలన్నారు. ఆయిల్‌పాం పంటలను వేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. అనంతరం ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరి, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, ఏఈఓ దివ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మోజామిల్, అంజనేయులు, విత్తన దుకాణ యజమానులు శ్రీకాంత్, రాజు, బాలకృష్ణ పలువురు రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్


