● ‘ఎల్‌నినో’ను పట్టించుకోని రైతులు
● జిల్లాలో ఇప్పటికే 90 వేల ఎకరాల్లో నాట్లు
● నష్టం తప్పదంటున్న అధికారులు
జిల్లావ్యాప్తంగా ఈఏడాది 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అందులో 3.15 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి పంటలు సాగవుతాయని అంచనా. మిగితా 50 వేల ఎకరాల్లో పత్తి సాగుతో పాటు కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలు సాగు చేయనున్నారు. కానీ ఎల్‌నినో ముప్పుతో వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా జిల్లాలో చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. ఇప్పటికే లోటు వర్షపాతం నమోదు అయింది. చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేక ఎడారులను తలపిస్తున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి ఊటలు తగ్గాయి. అడపాదడపా కురిసిన వర్షాలతో వరి సాగును తగ్గించి కంది, పెసర, మినుములు, సో యా, ఆయిల్‌పాం, కూరగాయలు సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా మూడు విడతలుగా విభజించి పంటలు సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో ఇప్పటికే మొదట విడతగా రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందజేశారు. అయితే జిల్లాలో బోరుబావుల ఆధారంగా 90,819 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. వర్షాలు కురవకుంటే బోరు బావుల్లో నీటి ఊటలు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రేపటి నుంచి రెండో విడత
ఈనెలాఖరు వరకు చెప్పుకోదగిన వర్షాలు కురవకపోతే రెండో విడత ప్రణాళిక అమలు చేయనున్నారు. దీంతో ఈనెల 27, 28, 29 మూడు రోజుల పాటు రైతులకు మరోమారు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు అధికారుల సన్నద్ధమవుతున్నారు. ఆరుతడి. స్వల్పకాలిక పంటలనే సాగు చేయాలని విస్తృతంగా ప్రచారం చేయటంతో పాటు అందుకు సంబంధించిన విత్తనాలను రైతు వేదికల్లో అన్నదాతలకు అందుబాటులో ఉంచనున్నారు.
కొల్చారం మండలంలోని చిన్నఘణాపూర్‌లో వరి సాగు
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నా, జిల్లా రైతాంగం మాత్రం వరి వైపే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే 90 వేల ఎకరాల్లో వరి నాట్లుపూర్తి చేశారు. అయితే, వర్షాలు పడకపోతే నష్టం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
– మెదక్‌జోన్
ఆరుతడి పంటలు మేలు
ఎల్‌నినో ముప్పు ఉందని విస్తృతంగా అవగాహన కల్పించినా, కొందరు రైతులు మా మాట పెడచెవిన పెట్టి వరిసాగు చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని రకాల పంటలు 1,31,262 ఎకరాల్లో సాగు కాగా, అందులో 90,819 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటికై నా వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి. లేనిచో నష్టం చవిచూడాల్సి వస్తోంది.
– దేవ్‌కుమార్, డీఏఓ


