సాక్షి, సిద్దిపేట: ఎన్నో ఏళ్లుగా భక్తులు కలలుకంటున్న కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయానికి రైలు అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం భక్తుల కోరిన కోర్కెలను తీర్చుతూ వారి కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. భక్తుల వినతుల మేరకు కొమురవెల్లికి హాల్ట్ రైల్వేస్టేషన్‌ను కేంద్రం మంజూరు చేసింది. రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వేస్టేషన్‌ను ఆదివారం(నేడు) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించి, రైలును స్టేషన్‌లో నిలుపనున్నారు. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్‌గా రైల్వే శాఖ నామకరణం చేసింది. కొమురవెల్లికి రైలు మార్గం రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టు వ్యయం రూ.1,160 కోట్లు
మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వేమార్గంలో భాగంగా సిద్దిపేట వరకు రైలు రాకపోకలు సాగిస్తోంది. ఈ రైల్వే ప్రాజెక్ట్‌ను రూ. 1,160 కోట్ల వ్యయంతో చేపట్టారు. తొలుత కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయలేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులకు భక్తులు వినతులు సమర్పించడంతో హాల్ట్ స్టేషన్‌ను మంజూరు చేశారు. 15 ఫిబ్రవరి 2024న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
ప్రయాణం మరింత సులభం
ప్రతీ ఏటా మల్లన్న బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, కర్ణాటక, చత్తీస్‌గడ్, మహారాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కొమురవెల్లికి తరలివస్తుంటారు. ఇప్పటివరకు రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చిన భక్తులకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణం మరింత సులభం కానుంది. ప్రయాణ సమయం, ఖర్చు తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లికి రూ.25లు, సిద్దిపేట నుంచి కొమురవెల్లికి రూ.10 రైల్వే చార్జీగా నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు నడుస్తున్న నాలుగు డెమూ రైళ్లను (రెండు అప్..మరో రెండు డౌన్) ప్రతీ రోజు కొమురవెల్లి స్టేషన్‌లో హాల్ట్ చేయనున్నారు.
భక్తుల వినతితో రైల్వేస్టేషన్ ఏర్పాటు
రూ.6 కోట్ల వ్యయంతో నిర్మాణం
భక్తులకు ప్రయాణం మరింత సులభం
నేడు ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి


