అల్లాదుర్గం(మెదక్): పేదలకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి సుచరిత తెలిపారు. శనివారం అల్లాదుర్గం పంచాయతీ కార్యాలయంలో గృహహింస, వ్యవసాయ చట్టాలు, మహిళలపై దాడులు, కేజీబీవీలో బాలల హక్కులు, బాల్య వివాహా లు, పోక్సోపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలపై లైంగిక దాడులు, బాల్య వివాహాలు చేస్తే పోక్సో కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాలికలు ధైర్యంగా ఉండాలని, ఎవరైన వేధిస్తే భయపడకుండా పోలీసులకు చెబితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సౌమ్య, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): జిల్లా విద్యాశాఖ అధికారి రాజు శనివారం ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు శంకరశర్మ ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. డీఈఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట అక్షయ పాత్ర మెదక్ ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి, పవన్ కుమార్, రాకేశ్ కుమార్, భట్టు నాగరాజు, వికాస్ రాజు, బత్తిని రాజు ఉన్నారు.
రామాయంపేట(మెదక్): రామాయంపేట ప్రా జెక్టు పరిధిలోని ఆరు మండలాలకు చెందిన అంగన్‌వాడీ సహాయకుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుందని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి స్వరూప తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. చేగుంట మండలంలో 14, చిన్నశంకరంపేటలో 10, రామాయంపేట, నిజాంపేట మండలాల్లో 8, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కాగా 27న చేగుంట, 28న చిన్నశంకరంపేట, 29న రామాయంపేట, నిజాంపేట, 30న వెల్దుర్తి, మాసాయిపేట మండలాలకు చెందిన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తామన్నా రు. ఆన్‌లైన్ రసీదుతో పాటు సర్టిఫికెట్లను వెంట తీసుకొని రావాలని సూచించారు.
టేక్మాల్(మెదక్): మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎస్పీ శ్రుతికీర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర విజిలెన్స్ బృందం శనివారం తనిఖీలు చేపట్టింది. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రికార్డులు, లైసెన్స్, ధరల పట్టి కలు, రైతులకు బిల్లుల జారీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యమైన ఎరువులను నిర్ణీత ధరలకే రైతులకు విక్రయించాలని అధికారులు సూచించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఎరువుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకుంటున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఏఓ కోటేశ్వర్, మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ పాల్గొన్నారు.


