వచ్చేనెల 3 వరకు ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

వచ్చేనెల 3 వరకు ‘సర్‌’

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

వచ్చేనెల 3 వరకు ‘సర్‌’ ప్రమాద బాధితులను రక్షిస్తే ప్రోత్సాహకం అక్రమ గ్యాస్‌ రీఫిల్లింగ్‌ను సహించం స్పాట్‌ అడ్మిషన్లకు నేడే తుది గడువు 20న చలో కలెక్టరేట్‌

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్‌) నమోదు గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడగించిందని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త షెడ్యూల్‌ ప్రకారం బూత్‌స్థాయి అధికారులు ఆగస్టు 3వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలు సేకరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించాలని సూచించారు. ఇంటింటి సర్వే, ఫీల్డ్‌ వెరిఫికేషన్‌, దరఖాస్తుల పరిశీలన వంటి ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని ఆదేశించారు. బూత్‌స్థాయి అధికారులు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అందిన దరఖాస్తులను ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సకాలంలో పరిష్కరించాలని చెప్పారు.

మెదక్‌జోన్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షిస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం రాహ్‌–వీర్‌ పథకంలో భాగంగా రూ. 25 వేల ప్రోత్సాహకం అందిస్తుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రిలో చేర్పిస్తే బతికే అవకాశాలు ఉంటాయన్నారు. అలాగే ఈ పథకం కింద బాధితులకు రూ.1.5 లక్షల వరకు, గరిష్టంగా ఏడు రోజుల పాటు ఉచిత క్యాష్‌లెస్‌ వైద్య చికిత్స అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన కానిస్టేబుల్‌ రమేశ్‌ను ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

తూప్రాన్‌: అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌ సంఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేయడంతో పాటు 40 కమర్షియల్‌, 22 డొమెస్టిక్‌ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి నిత్యానంద్‌ తెలిపారు. ఈనెల 14న మనోహరాబాద్‌ మండలం పర్కిబండ శివారులో జరిగిన సంఘటనపై వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ గ్యాస్‌ వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అక్రమార్కులను భయపడొద్దన్నారు. గ్యాస్‌ అక్రమ వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్‌ఐ నర్సింహా, ఇన్‌స్పెక్టర్‌ గణేశ్‌ ఉన్నారు.

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండల కేంద్రంలోని డైట్‌ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు మిగిలిపోయిన డైట్‌ సీట్ల భర్తీ చేయనున్నట్లు డీఈఓ, కళాశాల ప్రిన్సిపాల్‌ రాజు తెలిపారు. గురువారం స్పాట్‌ అడ్మిషన్లకు 87 మంది హాజరయ్యారని చెప్పారు. నేడు కూడా నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సీట్ల కేటాయింపు ఉంటుందని, స్పాట్‌ అడ్మిషన్ల కోసం హాజరయ్యే వారు తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

మెదక్‌ కలెక్టరేట్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ రంగ కార్మికులను దగా చేస్తున్నాయని, ఇన్సూరెన్స్‌ల పేరిట రూ. కోట్లు దుర్వినియోగం చేస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. ఈనెల 20న కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను మెదక్‌లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. జిల్లాలోని భవన నిర్మాణ రంగ కార్మికులు పెద్దఎత్తున ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి సంతోశ్‌, నాయకులు అనిల్‌, రవి, కిరణ్‌, వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement