● అస్తవ్యస్తంగా నర్సరీల నిర్వహణ
● రూ. లక్షలు దుర్వినియోగం
● ప్రజలకు కరువైన ఆహ్లాదం
మున్సిపాలిటీలోని మార్కెట్ కమిటీ కార్యాలయం వెనుక భాగంలోని ప్రభుత్వ భూమిలో రూ. లక్షలు ఖర్చుపెట్టి గతంలో నర్సరీ ఏర్పాటు చేశారు. ఇందులో మొక్కల సంరక్షణ పేరిట రూ. లక్షలు దుర్వినియోగం చేశారు. నర్సరీ చుట్టూ ఫెన్సింగ్ వేసి గేటు, ఆర్చ్ నిర్మించారు. ెమొక్కలకు నీటి కోసం ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి బోరు తవ్వించారు. ఇందులో వేల సంఖ్యలో మొక్కలు నాటినట్లు అధికారులు వాస్తవానికి విరుద్ధంగా ప్రకటించారు. నాటిన మొక్కలను పట్టణ వాసులకు పంపిణీ చేసినట్లు గతంలో ప్రకటించగా, అది తప్పని తేలింది. ఈనర్సరీలో మొక్కలు సైతం కొన్ని ఎండిపోయాయి. ఏమైందో తెలియదు కాని కేవలం నీటి వసతి లేదనే కారణంతో ఈనర్సరీని వదిలేసి దీని స్థానంలో వెంకటేశ్వరకాలనీలో మరోటి ఏర్పాటు చేశారు. దీనిలో కూడా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటినట్లు అధికారులు ప్రకటించినా, ప్రస్తుతం అందులో పదుల సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నారు. ఈ నర్సరీ కోసం బడ్జెట్‌లో రూ. ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు రికార్డులో నమోదు చేయగా, విచారణలో తప్పని తేలింది. రహదారి పక్కనే ఉన్న నర్సీరీని వదిలేయడంతో సామగ్రి దొంగలపాలవుతోంది.
పదుల సంఖ్యలో మొక్కలు
వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన నర్సరీలో కేవలం పదుల సంఖ్యలో మొక్కలు ఉండగా, గతంలో బోరు తవ్వించారు. ఈనర్సరీ చుట్టూ పెన్సింగ్, ఆర్చ్, వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గాను గతంలోనే నిధులు మంజూరైనా పనులు కాలేదు. ఇందులో సైతం తక్కువ సంఖ్యలో మొక్కలు ఉండగా, వీటి నిర్వహణ పేరిట ఖర్చు చేసిన రూ. లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఈవిషయమై పట్టణ వాసులు పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతరించిపోతున్న అడవులను పునరుద్ధరించడం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని తీర్చిదిద్దడం వన మహోత్సవం ముఖ్య ఉద్దేశం. అయితే అందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మొక్కల సంరక్షణ పేరిట రూ. లక్షలు దుర్వినియోగమయ్యాయి.
– రామాయంపేట(మెదక్)


