ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి

Jul 13 2026 8:15 AM | Updated on Jul 13 2026 8:15 AM

పటాన్‌చెరు టౌన్‌: సర్‌ ప్రక్రియపై పార్టీ నాయకులు, ఆశావహులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం పోయిందని.. స్కామ్‌ల ప్రభుత్వం పోయి మళ్లీ సంక్షేమ పథకాల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎస్‌ఐఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సర్‌ ప్రక్రియ కారణంగా ఓటర్ల జాబి తాల్లో అవకతవకలు జరిగి ఎన్నికల ఫలితాలు మారాయని ఆరోపించారు. సిగాచి ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయలేదని, కంపెనీ యాజమాన్యమే పరిహారం చెల్లించిందని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో పటాన్‌చెరు పట్టణంలో రూ.200 కోట్లతో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడం చేతకాని దద్దమ్మ రాష్ట్ర ప్రభుత్వం అని విమర్శించారు. పటాన్‌చెరులో ఐటీ పార్క్‌ కోసం కేటాయించిన భూమిని ప్రభుత్వం విక్రయించిందని ఆరోపించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని అన్ని స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీజీఐఐసీ మాజీ చైర్మన్‌ బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీఆర్‌ఎస్‌ పార్టీ కోఆర్డినేటర్‌ ఆదర్శ్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ విజయ్‌, మున్సిపల్‌ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజీమంత్రి హరీశ్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement