మెదక్‌జోన్/మెదక్ కలెక్టరేట్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించి ఉమ్మడి మెదక్ జిల్లాను టాప్‌లో నిలపాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మూడు జిల్లాల కలెక్టర్లు, జిల్లాల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఉమ్మడి జిల్లాకు తాగు, సాగు నీటిని అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా, ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు ప్రజాప్రతినిధులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఉమ్మడి మెదక్ జిల్లాను టాప్‌లో నిలపండి
ఇన్‌చార్జి మంత్రి వివేక్
కలెక్టరేట్‌లో ప్రజాపాలన– ప్రగతి
ప్రణాళిక సన్నాహక సమావేశం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఇది మూడోసారని, గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. జిల్లాలో వానాకాలంలో భారీ వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించి, నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి పైసా ఇవ్వలేదన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్‌ఆర్ నిధుల నుంచి ఫైర్ వాహనాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హత్నూరలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. డంప్‌యార్డుల పక్కన అర ఎకరం ప్రభుత్వ స్థలం కేటాయిస్తే చెత్త నుంచి బయో డీజిల్ తయారు చేసేందుకు గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ముందుకు వచ్చాడని వివరించారు.
అర్హులైన ప్రతి రైతుకు బీమా చేయించే బాధ్యత వ్యవసాయ అధికారులు తీసుకోవాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్ సూచించారు. అలాగే కేంద్రం సబ్సిడీపై అందించే సూర్య హర్‌ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు రోహిత్‌రావు, సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ప్రతిమాసింగ్, ప్రావీణ్య, హైమావతితో పాటు మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్, ఎస్పీ శ్రీనివాస్‌రావు, అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.


