వచ్చేది బీజేపీ ప్రభుత్వమే | - | Sakshi
Sakshi News home page

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

Mar 7 2026 10:10 AM | Updated on Mar 7 2026 10:10 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆపార్టీ రాష్ట్ర నాయకుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ వెళ్తుండగా, నార్సింగి మండల కేంద్రంలో కొద్దిసేపు ఆగి కార్యకర్తలతో మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. రాష్ట్రంలో ఆపార్టీ మళ్లీ గెలిచే పరిస్థితి లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సైతం అదే పరిస్థితిలో ఉందన్నారు. ఈసందర్భంగా నార్సింగి నుంచి శాలిపేట వరకు రోడ్డు అభివృద్ధికి కృషి చేయాలని, రైల్వే వంతెన నిర్మాణానికి సహకరించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, నాయకులు లింగారెడ్డి, నరేష్‌, యాదగిరి, శ్రీనివాస్‌, నరేష్‌నాయక్‌, సాయికుమార్‌, వినోద్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మెడికల్‌ బిల్లుల

మంజూరులో జాప్యం

మెదక్‌జోన్‌: మెడికల్‌ బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోందని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు యాదగిరి అన్నారు. శుక్రవారం యూనియన్‌ బాధ్యులు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి మెడికల్‌ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రారామిరెడ్డి, సంగయ్య, హీరాలాల్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

పేదలకు నాణ్యమైన వైద్యం

అల్లాదుర్గం(మెదక్‌): పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు డిప్యూ టీ డీఎంహెచ్‌ఓ అనీల తెలిపారు. శుక్రవారం అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. అన్ని రకాల డాక్టర్లతో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన వారికి జిల్లా, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. వంద రోజులలో నాలుగు విడతలుగా జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైద్యులు నవ్య, అశ్విని, సర్పంచ్‌ సౌమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి

‘ప్రగతి ప్రణాళిక’

గజ్వేల్‌: మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’దోహదపడుతుందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గంగిశెట్టి చందనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో పాలన తీరు మెరుగుపరచడంతోపాటు పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కాగా 16వార్డులో శిథిలావస్థలో ఉన్న మొండి గోడలను తొలగించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement