కొల్చారం(నర్సాపూర్): నిధులు విడుదల చేయకుండా ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ముందుకు సాగుతుందా..? అని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం మండలంలోని సంగాయిపేటలో రూ. 30 లక్షలతో నిర్మించనున్న గోదాంతో పాటు పలు గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కేంద్రం నుంచి వస్తున్న ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయడం తప్పించి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది లేదన్నారు. ఇప్పటికే కొత్త సర్పంచ్‌లు నిధుల లేమితో గ్రామాల్లో పనులు చేయలేని పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం గ్రామ సమాఖ్య భవనాలు నిర్మించడం హర్షనీయమన్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా, ఏఓ శ్వేతా కుమారి, సంగాయిపేట రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఉప సర్పంచ్ నందు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రమేశ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


