జిల్లాలో ఏడాదిగా పేరుకుపోయిన దొడ్డు బియ్యం వేలానికి ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే ముక్కిపోయి, పురుగులు పట్టిన ఈ బియ్యం కొనుగోలుకు మొదట్లో టెండర్ పిలిచినా, ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ధర తగ్గించి రెండోసారి జిల్లా పరిధిలోనే వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈమేరకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అయితే పూర్తిగా చెడిపోయిన ఈ బియ్యం కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా..? వేచి చూడాలి.
– రామాయంపేట(మెదక్)
జిల్లావ్యాప్తంగా 520 రేషన్ దుకాణాలు ఉండగా, వీటి ద్వారా గతేడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తుంది. అంతకుముందు సరఫరా చేసిన దొడ్డు బియ్యం నిల్వలను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏడాది గడుస్తున్నా, పౌర సరఫరాల శాఖ తాత్సారం చేయడంతో బియ్యం ఎందుకు పనికిరాకుండా పోయాయి. రేషన్ దుకాణాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, బఫర్ గోదాంల్లో 3,044 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం పురుగులమయమైంది. ఈస్టాక్‌ను తరలించే విషయమై పౌర సరఫరాల శాఖ తాత్సారం చేయడంతో తుట్టెలు కట్టి ఎలుకలకు ఆహారమయ్యాయి. వీటిని భద్రపరచడం డీలర్లకు సమస్యగా మారింది. ఈ బియ్యం విలువ సుమారు రూ. 11 కోట్ల పైమాటే. చెడిపోయిన ఈబియ్యాన్ని విక్రయించడానికి ప్రభుత్వం మొదట కిలో రూ. 24కు చొప్పున విక్రయించడానికి టెండర్లు ఆహ్వానించగా, ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల సమావేశమైన మంత్రివర్గం పురుగులు పట్టిన దొడ్డు బియ్యం తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. మొదట్లో టెండర్ పిలిచినా, ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈనిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈమేరకు రూ. 21.60 కిలో చొప్పున విక్రయించడానికి గాను త్వరలో టెండర్లు పిలువనున్నారు.
జిల్లాలో ఇలా..
బియ్యం నిల్వలు (మెట్రిక్ టన్నుల్లో)
గోదాంలు 259.254
రేషన్ దుకాణాలు 503.116
బఫర్ గోదాంలు 2281.675
జిల్లాలో పేరుకుపోయిన 3,044 మెట్రిక్ టన్నులు
కిలో రూ. 21.60 విక్రయించాలని నిర్ణయం
ప్రభుత్వానికి రూ. కోట్ల మేర నష్టం


