రైల్వే డీఎన్ ధర్మరాజు, ఆర్డీఓ రమాదేవి
చిన్నశంకరంపేట(మెదక్): రైల్వే డబుల్ లేన్‌కు అవసరమైన భూ సేకరణకు రైతులు సహకరించాలని రైల్వే డీఎన్ ధర్మరాజు, మెదక్ ఆర్డీఓ రమాదేవి కోరారు. బుధవారం మండలంలోని మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో భూములు పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామానికి వెళ్లే రైల్వే బ్రిడ్జిలో నీరు నిల్వకుండా చూస్తే అవసరమైన భూ ములు ఇచ్చేందుకు తమకేలాంటి అభ్యంతరం లేదన్నారు. మరికొందరు రైతులు తమకు బ్రిడ్జితో సమస్య ఏర్పడుతుందని, మరో చోట నుంచి రహదారి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈసందర్భంగా డీఎన్ ధర్మరాజు మాట్లాడుతూ.. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బ్రిడ్జిలో చెరువు నీరు నిల్వకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. బ్రిడ్జి వద్ద నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన పైప్‌లైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అదనపు దారి విషయంలో గ్రామస్తులు చర్చించుకొని రహదారికి అవసరమైన భూమిని అందిస్తే అదనపు రోడ్డును కూడా వేసి ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో రైల్వే డబుల్ లైన్ భూసేకరణ అధికారులు రాకేష్, రమేష్, చిన్నశంకరంపేట తహసీల్దార్ మాలతి, ఆర్‌ఐలు రాజు, వినయ్, మిర్జాపల్లి ప్రజాప్రతినిధులు రమణ, జనార్దన్, మనోజ్, యాదగిరి, సంజీవ్, గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


