నాచగిరిలో నిరర్ధక భవనాల తొలగింపు
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రంలో గుదిబండగా మారిన శిథిల భవనాల తొలగింపునకు మోక్షం లభించింది. శిథిల ప్రక్షాళన.. సౌకర్యాల కల్పనే’ధ్యేయంగా ఆలయం చుట్టూ చెత్త చెదారం, పిచ్చిమొక్కలు, పెరిగి, బూత్‌బంగ్లాలను తలపిస్తున్న దశాబ్ధాల క్రితం నాటి శిథిల భవనాల కూల్చివేత పనులు వేగవంతం చేసింది. అక్కడ దుకాణ సముదాయాలు, వసతి గృహాలు నిర్మించి యాత్రికులకు సౌకర్యాలు మెరుగుపరచే దిశగా అడుగులు వేస్తున్నది. అంచెల వారీగా ఒక్కో పని చక్కబెట్టుకుంటూ గుడిని సాధ్యమైనంత అభివృద్ధి చేసుకుందామనే యోచనలో ఆలయ యంత్రాంగం ముందుకు సాగుతున్నది.
శిథిలమై.. చిక్కిశల్యమై..
భక్తుల సౌకర్యం కోసం దశాబ్ధాల క్రితం నిర్మించిన అనేక భవనాలు శిథిలమయ్యాయి. దుకాణ సముదాయాల వెనుక, ప్రధాన గుడి పక్కన అనేక శిథిల భవనాలు ఆలయ శోభను దెబ్బతీస్తున్నాయి. హరిద్రాతీరం వెంబడి, సభామండపం పక్కన సత్రాలు ఇదే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటిని తొలగిస్తే ఆలయ శోభ ఇనుమడించడంతోపాటు సౌకర్యా లు మెరుగుపరిచే వీలు కలుగుతుంది.
రెండేళ్ల క్రితమే అనుమతి
నాచగిరి గుడి చుట్టూ శిథిల భవనాల తొలగింపునకు రెండేళ్ల క్రితమే దేవాదాయశాఖ నుంచి అను మతి వచ్చింది. తాజాగా ఆలయ యంత్రాంగం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. శిథిల ప్రక్షాళన దిశగా తొలగింపు పనులను వేగవంతం చేసింది.


