దుర్గమ్మ పేరిట దోపిడీ!
ఏళ్ల తరబడి సాగుతున్న అక్రమ దందా
జాతర ముగిసి వారం గడిచినాజమ కాని సొమ్ము
ఏడుపాయల్లో ‘పంచాయతీ’ పెత్తనం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరలో పంచాయతీ దోపిడీకి తెరలేపింది. దేవాలయ, అటవీ భూముల్లో నాగ్సాన్‌పల్లి పంచాయతీ సిబ్బంది అక్రమంగా తైబజార్ వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. చిత్రమేమిటంటే ‘ఏడుపాయల వనదు ర్గా భవాని దేవస్థానం’ పేరిట రశీదులు ముద్రించి వసూళ్లకు తెగబడుతున్నారు. అధికారులు రూ.18 వేలు మాత్రమే వసూలయ్యాయని చెబుతున్నా, అంతకన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదంతా జిల్లా పంచాయతీ అధికారుల కనుసన్నల్లోనే జరగడం కొసమెరుపు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆలయ ఈఓ వీరేశం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
కొన్నేళ్లుగా వసూళ్ల పర్వం
రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల.. ఎండోమెంట్ శాఖ అధీనంలో ఉండి, 6ఏ టెంపుల్‌గా గుర్తింపు పొందింది. ఆలయానికి 50.03 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనిని ఆనుకొని చెలిమెల కుంట నుంచి దాసోజి ఫంక్షన్‌హాల్ వరకు అటవీ భూ ములు ఉన్నాయి. జాతర సమయంలో చెలిమెల కుంట నుంచి రోడ్డుకు ఇరువైపులా అటవీ, దేవస్థాన భూముల్లో వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. గత కొన్నేళ్లుగా నాగ్సాన్‌పల్లి పంచాయతీ అధికారులు వీరి నుంచి తైబజార్ వసూలు చేస్తున్నారు. ఏడుపాయల దేవ స్థానం పేరిట రశీదు బుక్కులు ప్రింటింగ్ చేయించి, వారికి తెలియకుండానే దుకాణానికి రూ.500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. రశీదు కింద మాత్రం పంచాయతీ సెక్రటరీ సంతకం ఉంటుంది. అయితే నిజానికి పంచాయతీ ఏవైనా వసూళ్ల కోసం బిల్లు బుక్కులు ప్రింటింగ్ చేయిస్తే, వాటి వివరాలు, సీరియల్ నంబర్‌తో సహా ‘మనీ వాల్యూ రిజిస్టర్‌లో’ నమోదు చేయాలి. అలాగే వసూలు చేసిన డబ్బులు ‘ఇన్సార్ నామా’(కలెక్షన్ రిజస్టర్)లో నమోదు చేసి వారం రోజుల్లో చలాన్ కట్టాలి. అయితే ఇలాంటి రికార్డులు పంచాయతీ కార్యాలయంలో లేవు. జాతర ముగిసి 9 రోజులు గడిచినా, డబ్బులు పంచాయతీ కార్యదర్శి వద్దే ఉన్నాయి. ఇదే విషయమై కార్యదర్శి భానుప్రకాశ్‌ను వివరణ కోరగా.. కొంత మంది వ్యాపారులు డబ్బులు ఇవ్వలేదని, జాతరలో రూ.18,230 మాత్రమే వసూలయ్యాయని చెప్పారు. గత జాతరలో వసూలు చేసిన డబ్బులు వివరాలు కూడా కార్యాలయంలో అందుబాటులో లేవన్నారు.
రశీదులు ముద్రించి
తైబజార్ వసూలు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం
ఎండోమెంట్ పరిధిలో మాకు తెలియకుండా ఆలయం పేరిట రశీదు బుక్కులు ప్రింటింగ్ చేయించి, తైబజార్ వసూలు చేయడం అంటే మమ్మల్ని మోసం చేయడమే. కనుక పంచాయతీ అధికారులపై తగు చర్య కోసం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం.
– వీరేశం, ఈఓ, ఏడుపాయల
దుర్గమ్మ పేరిట దోపిడీ!


