రెండోరోజు 98.26 శాతం హాజరు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్‌మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం రెండో రోజు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ద్వితీయ భాష పరీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా జనరల్ విద్యార్థులకు 28, ఒకేషనల్ విద్యార్థులకు 6 చొప్పున మొత్తం 34 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 5,472 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 5,377 మంది హాజరయ్యారు. మరో 95 మంది గైర్హాజరయ్యారు. దీంతో 98.26 శాతం హాజరు నమోదైంది. జిల్లాలోని పలు కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఇంటర్ నోడల్ అధికారిణి మాధవి తెలిపారు.


