విద్యతోనే బంగారు భవిష్యత్తు
కలెక్టర్ రాహుల్‌రాజ్
పాపన్నపేట(మెదక్)/మెదక్‌జోన్: విద్యతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాగ్సాన్‌పల్లి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న టెన్త్ స్పెషల్ క్లాసులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. త్వరలో జరుగనున్న పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. స్పెషల్ క్లాసులు వింటూ, స్లిప్ టెస్ట్‌లు రాస్తూ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. వెనుకబడిన విద్యార్థులు కనీసం ఉత్తీర్ణులయ్యేలా తీర్చిదిద్దాలని టీచర్లను ఆదేశించారు. కనీస సామర్థ్యాల స్థాయి తెలుసుకునేందుకు, విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ముఖ్యమైనది అని తెలిపారు. అనంతరం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 31 పాఠశాలలకు మంజూరైన ప్రధాన మంత్రి (పీఎం శ్రీ) నిధులను మార్చి 2వ తేదీ వరకు ఖర్చు చేసి పాఠశాలల సమస్యలను పరిష్కరించాలన్నారు. వాటిని సకాలంలో ఖర్చు చేయకుంటే వాపస్ పోయే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో డీఈఓ విజయ, ఫైనాన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


