పంటలకు ఊపిరి | - | Sakshi
Sakshi News home page

పంటలకు ఊపిరి

Feb 25 2026 11:34 AM | Updated on Feb 25 2026 11:34 AM

పంటలకు ఊపిరి

పంటలకు ఊపిరి

హల్దీ ప్రాజెక్టులో కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మండుటెండలు ఒకవైపు, నిరంతరంగా మోటార్ల ద్వారా పంటలకు నీటిని ఎత్తిపోస్తుండటంతో హల్దీప్రాజెక్టులో నీరు ఇంకి పోయింది. ఫలితంగా సాగుచేసిన వేలాది ఎకరాల పంటలు ఎండుముఖం పట్టాయి. ప్రాజెక్టులోకి గోదావరి నీటిని వదలాలని అన్నదాతలు వేడుకోవడంతో స్పందించిన ప్రభుత్వం కాళేశ్వరం నీటిని విడుదల చేసింది. దీంతో పంటలకు ఊపిరి పోసినట్లయింది.

– మెదక్‌జోన్‌

జిల్లాలో తూప్రాన్‌, మాసాయిపేట, వెల్దూర్తి, చిన్నశంకరంపేట, కొల్చారం, మెదక్‌, హవేళిఘనాపూర్‌, మండలాల పరిధిలో సుమారు 65 నుంచి 70 కిలో మీటర్ల మేర హల్దీ ప్రాజెక్టు(వాగు) ప్రవహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 2.7 లక్షల ఎకరాలలో వరిపంటలు సాగు చేశారు. అందులో ఈ ప్రాజెక్టు పరిధిలో 50 వేల ఎకరాల మేర పంటలు సాగవుతున్నాయి. ప్రాజెక్టులో నీరు ఎండిపోవటంతో పంటలకు తడులు అందక ఎండుముఖం పట్టాయి. నీటిని వదిలి ఆదుకోవాలంటూ రైతుల మొర విన్న నేతలు, కొండపోచమ్మ రిజర్వాయర్‌ ద్వార హల్దీప్రాజెక్టులోకి మూడు రోజుల క్రితం గోదావరి జలాలను వదిలారు. దీంతో మంగళవారం నాటికి తూప్రాన్‌ మండలంలోని యావాపూర్‌ శివారులోకి నీరు వచ్చింది. మరో రెండు, మూడు రోజుల్లో మెదక్‌, హవేళిఘనాపూర్‌ మండలాల పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుపై సుమారు 30కి పైగా చెక్‌డ్యాములను నిర్మించారు. ఇది ఒక్కసారి నిండితే రెండు పంటల వరకు ఫికర్‌ ఉండదని రైతులు చెబుతున్నారు.

భూగర్భ జలాలు వృద్ధి

హల్దీప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఇసుక మేటలు నిండి ఉండటంతో ఒక్కసారి ప్రవహిస్తే ఏడాది వరకు నీరు కదలదు. అంతే కాకుండా ప్రాజెక్టు నుంచి మొదలుకుని ఎటూ మూడు కిలోమీటర్ల మేర భూగర్భజాలలు పుష్కలంగా పెరుగుతాయి. దీంతో ఫెయిల్‌ అయిన బోరుబావుల్లో సైతం పుష్కలంగా నీరు వస్తోందని రైతులు చెబుతున్నారు. అంతే కాకుండా అన్నదాతలు ప్రాజెక్టులో మోటార్లను బిగించి రెండు, మూడు కిలోమీటర్ల వరకు పైపులైన్లద్వారా నీటిని మళ్లించి పంటలను సాగుచేస్తున్నారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్టును ఆనుకుని ఉన్న గ్రామాలకు తాగునీటిని సైతం దీనినుంచే తరలిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలోని ఏడు మండలాలకు ఈ ప్రాజెక్టు జీవనది అని చెప్పొచ్చు.

హల్దీప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు

మండుటెండల్లో చెక్‌డ్యాంల పరవళ్లు

సస్యశ్యామలం కానున్న

50 వేల ఎకరాలు

అన్నదాతల్లో హర్షాతిరేకాలు

గోదావరి జలాలను హల్దీవాగులోకి వదలడంతో ప్రస్తుతం తూప్రాన్‌మండల పరిధిలోకి వచ్చాయి. మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు చివరి మండలమైనా హవేళిఘనాపూర్‌కు చేరుకుంటాయి. ఇక సాగునీటికి ఏలాంటి ఇబ్బందులు ఉండవు.

– శ్రీనివాస్‌రావు ఈఈ ఇరిగేషన్‌ మెదక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement