గిరిజన తండాల రోడ్లకు గ్రహణం
● కంకర పరిచారు.. బీటీ మరిచారు ● అర్ధంతరంగా ఆగినరూ. 9 కోట్ల పనులు
మెదక్ అర్బన్: మారూమూల తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలన్ని సర్కార్ సంకల్పం కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారి పోతుంది. ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద జిల్లాలో ఆరు రోడ్లకు నిధులు మంజూరైన పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఒక్క రోడ్డు మాత్రం పూర్తి కాగా, మరో 5 రోడ్లకు కంకర వేసి వదిలేశారు. బీటి వేయకపోవడంతో కంకరపై నడక గిరిజనులకు నరకాన్ని తలపిస్తుంది. జిల్లాలోని ఆరు గిరిజన తండాలకు రెండేళ్ల క్రితం బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 9 కోట్లు మంజూరు చేశారు. టేక్మాల్ మండలం పల్వంచ తండాకు రూ.80 లక్షలు, మల్కాపూర్ తండాకు రూ. 2.20 కోట్లు, కాదులూర్ తండాకు రూ. 2.20 కోట్లు, రేగోడ్ మండలం ఆరె ఇటిక్యాల్ తండాకు రూ.80 లక్షలు, మేడికుంద తండాకు రూ.1.50 కోట్లు, అల్లాదుర్గ్ మండలం కోమలికుంట తండాకు రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి. కాగా ఒక్క పల్వంచ తండా పనులు మాత్రం పూర్తయ్యాయి. కాగా గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరై రెండేళ్లు కావొస్తుంది. కాగా ఇప్పటివరకు కాంట్రాక్టర్ సుమారు రూ. 3 కోట్లు బిల్లులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
నోటీసులు ఇచ్చాం
తండాలకు మంజూరైన బీటీ రోడ్ల పనులు పూర్తి చేయాలని ఇప్పటికే కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం. బిల్లులు చెల్లింపులో జాప్యం జరగడంతో పనుల్లో కొంత ఆలస్యం జరిగింది. త్వరలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
– వేణు, ఈఈ, ఆర్‌అండ్‌బీ, మెదక్


