సరుకులు కల్తీ.. | - | Sakshi
Sakshi News home page

సరుకులు కల్తీ..

Feb 23 2026 9:00 AM | Updated on Feb 23 2026 9:00 AM

సరుకులు కల్తీ..

సరుకులు కల్తీ..

విద్యార్థులకు సుస్తీ
జిల్లాలో వరుసగా ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు

రామాయంపేట: విద్యార్థులను పరీక్షిస్తున్న డాక్టర్లు

జిల్లావ్యాప్తంగా 904 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 72 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో 273 పాఠశాలల్లో అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. మిగితా 631 పాఠశాలల్లో ఎస్‌హెచ్‌జీ సభ్యులు వంట చేస్తున్నారు. ఇకపోతే జిల్లాలో 19 కేజీబీవీలు ఉండగా, వాటిలో ఎనిమిదింటిలో కళాశాలలు కొనసాగుతున్నాయి. మిగితా 11 పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో సుమారు 4 వేల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలల్లో కూరగాయల నుంచి మొదలుకొని నెలలో ఆరుసార్లు పెట్టే చికెన్‌, మటన్‌, పాలు తదితర వస్తువులను కాంట్రాక్టర్‌ సరఫరా చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ బడుల్లో పెట్టే మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూరగాయలు, గుడ్లు ఇతర వంట సామగ్రిని ఎస్‌హెచ్‌జీ నిర్వాహకులు అందిస్తున్నారు. కాగా తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులు కొనుగోలు చేయడంతో పాటు వంట చేసే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే తినే ఆహారం విషతుల్యం అయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల రేగోడ్‌లోని కేజీబీవీలో మధ్యాహ్న భోజనం తిన్న 234 మంది విద్యార్థుల్లో 25 మంది విద్యార్థినులు, ఇద్దరు ఉపాధ్యాయులకు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. అలాగే రామాయంపేట ఉన్నత పాఠశాలలో పురుగులు పట్టిన రాగి జావ తాగిన ఆరుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

నామమాత్రంగా ఫుడ్‌ కమిటీలు

ప్రతి పాఠశాలలో ఫుడ్‌ కమిటీలు నిర్వహించాలి. కొన్ని పాఠశాలల్లో ఈ కమిటీలు ఉన్నప్పటికీ అవి పేరుకే ఉన్నాయి. ఫుడ్‌ కమిటీల్లో సభ్యులుగా ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు టీచర్లు, పీఈటీ, నలుగురు పదోతరగతి విద్యార్థులు కమిటీ సభ్యులుగా ఉంటారు. అలాగే కేజీబీవీల్లో కమిటీ సభ్యులుగా స్పెషల్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఓ) ఏఎన్‌ఎం, సీఆర్‌టీ, నలుగురు పదో తరగతి విద్యార్థినులతో కమిటీ వేయాలి. ప్రతి రోజు ఈ కమిటీ సభ్యులు వంట సరుకులను పరిశీలించాలి. నాణ్యతగా ఉంటేనే వంట చేసేందుకు అనుమతి ఇవ్వాలి. అయితే జిల్లాలో ఈ కమిటీలు చాటా చోట్ల నామమాత్రంగానే పని చేస్తున్నాయి.

విద్యార్థులకు వైద్య సేవలు

రామాయంపేట(మెదక్‌): రాగిజావ తాగి అస్వస్తతకు గురైన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఆదివారం జిల్లా ఉప వైద్యాధికారిణి డాక్టర్‌ అనిల పరామర్శించి వైద్య సేవలు అందజేశారు. స్కూల్‌ పక్కనే ఉన్న ఉన్న హాస్టల్‌లో ఉంటున్న వీరిని డాక్టర్ల బృందం పరీక్షించి మందు లు అందజేశారు. వారితో పాటు ఇతర విద్యార్థులను సైతం పరీక్షించారు. విద్యార్థులు ట్యాంక్‌ నీరు తాగుతున్నందున అస్వస్తతకు గురయ్యే అవకాశం ఉందని, ముందస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

తనిఖీలు నిర్వహిస్తున్నాం

ప్రతి పాఠశాలలో వంటకు ఉపయోగించే వస్తువులు నాణ్యమైనవి మాత్రమే వాడాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చాం. మేము సైతం తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ రంగ పరిధిలో కొనసాగే అన్ని పాఠశాలల్లో ఫుడ్‌ కమిటీల విధి విధానాలపై ఆదేశాలు జారీ చేస్తాం. – విజయ, డీఈఓ

మొన్న రేగోడ్‌.. నిన్న రామాయంపేట

ఆందోళనలో తల్లిదండ్రులు

దృష్టిసారించని ఉన్నతాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement