కోడ్ ముగిసినా రైతు భరోసా ఏదీ?
● ప్రజలు బీఆర్‌ఎస్‌వైపే ఉన్నారనడానికి పుర ఫలితాలే నిదర్శనం ● కంది జైల్లో పార్టీ నాయకులనుపరామర్శించిన మాజీమంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి/సంగారెడ్డిటౌన్ : ఎన్నికల కోడ్ పేరుతో ఆపిన రైతుభరోసాను వెంటనే రైతుల ఖాతాల్లో వేయాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పక్షాన ప్రత్యక్ష పోరాటానికి దిగి ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కంది జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలను శనివారం పరామర్శించిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. పైవారి మౌఖిక ఆదేశాలతో అక్రమ కేసులు బనాయిస్తే కిందిస్థాయి పోలీసులే జవాబుదారీ కావాల్సి వస్తుందని హితవు పలికారు. అక్రమ కేసులు, కాంగ్రెస్ గూండాయిజంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్తలపైనే తిరిగి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. పోలీసుల కాలర్ పట్టుకుని తన్నమన్న బీజేపీ నాయకుడిపై, బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడిపై అరెస్టులు లేవు కానీ ప్రశ్నిస్తే మాత్రం బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కేతనపల్లి, ఆమనగల్ తదితర ప్రాంతాల్లో కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేశారని ఆరోపించారు. పోలింగ్ బూత్‌లో ఉన్న బీఆర్‌ఎస్ ఏజెంట్‌ను, అధికారుల ముందే చంపేస్తానని బెదిరించిన మెదక్ ఎమ్మెల్యేపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. అధికార బలాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని మాత్రమే కాంగ్రెస్ కొన్ని స్థానాలను దక్కించుకుంది. ప్రజాతీర్పు బీఆర్‌ఎస్ వైపే ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


