బాధితులకు అండగా ఉండాలి
మెదక్ కలెక్టరేట్: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలలకు భరోసా సెంటర్ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్‌ను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. పోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. లైంగిక దాడులు, వేధింపులకు గురైన మహిళలు, బాలల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వారికి ధైర్యం కల్పించాలన్నారు. బాధితులకు ఎప్పటికప్పుడు న్యాయ, వైద్య సహాయం అందించడంతో పాటు మానసిక బలం చేకూర్చాలన్నారు. బాధితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఒకే చోట అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన వారు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో భరోసా సెంటర్ ఎస్‌ఐ శిరీష, కోఆర్డినేటర్ సౌమ్య, లీగల్ సలహాదారు శ్వేతతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ మహేందర్


