గైర్హాజరైన డాక్టర్లపై కమిషనర్‌కు నివేదిక
జోగిపేట ఆస్పత్రిని సందర్శించిన
డీసీహెచ్‌ఎస్ డాక్టర్ షరీఫ్
జోగిపేట(అందోల్): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రోజున విధులకు గైర్హాజరైన 12 మంది వైద్యులపై చర్యలకు డీసీహెచ్ డాక్టర్ షరీఫ్ నివేదికను సిద్ధం చేశారు. జోగిపేట ఏరియా ఆస్పత్రిని మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం షరీఫ్ సందర్శించి సోమవారం విధులకు హాజరుకాని డాక్టర్ల వివరాలు సేకరించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 13 మంది డాక్టర్లు విధులకు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు కేవలం మధ్యాహ్నం వరకే విధులు నిర్వహిస్తారని, ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో మాత్రమే డాక్టర్లు విధుల్లో ఉంటారని చెప్పారు. విధులకు గైర్హాజరైన వారి జాబితాను రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు పంపుతున్నట్లు తెలిపారు. జోగిపేట ఆస్పత్రిలో డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉండగా జిల్లాలోని ఇతర ఆస్పత్రుల నుంచి డిప్యూటేషన్ వేశామన్నారు.


