దుర్గమ్మా.. ఇదేం దుర్గతి!
రాజగోపురం ఎదుట చెప్పుల కుప్ప ● శివాలయం పక్కనే చెత్త కంపు
పాపన్నపేట(మెదక్): తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల జాతరలో పవిత్రత..పారిశుద్ధ్యం కనుమరుగవుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన లక్షలాది భక్తులు ఆలయం రాజగోపురం ముందు వేలాది చెప్పులు వదిలేస్తున్నారు. పక్కనే పాదరక్షలు నిల్వ ఉంచడానికి ..ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఆ హాలును కొబ్బరి కాయల కాంట్రాక్టర్‌కు ఇచ్చారు. గత్యంతరం లేక, రాజగోపురం ముందే భక్తులు చెప్పులు విడుస్తున్నారు. దీంతో ఆలయ ఠీవికి ప్రతీకగా నిలిచే, రాజగోపురం ముందు చెప్పుల కుప్పలు పేరుకు పోయాయి. అలాగే పాత దేవాదాయ శాఖ కార్యాలయం ఆనుకొని శివాలయం ఉంది.దాని పక్కనే భక్తులు తిని పారేసిన ఎంగిలి విస్తరాకులు, కుప్పలుగా పేరుకు పోయాయి. అయినా అటు ఆలయ సిబ్బంది, ఇటు పంచాయతీ శాఖ గానీ పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏటా జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు విడుదల చేస్తుంది. పంచాయతీ అధికారుల పారిశుద్ధ్యం, ఇతరత్రా ఖర్చుల కోసం రూ.15.25 లక్షలు ఖర్చు చేస్తున్నారు. సుమారు 800 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తున్నారు. అయినా పారిశుద్ద్య లోపం కనిపిస్తూనే ఉంది.
దుర్గమ్మా.. ఇదేం దుర్గతి!


