తూప్రాన్ చైర్‌పర్సన్‌గా రజనీ
వైస్ చైర్‌పర్సన్‌గా సమత
తూప్రాన్: మున్సిపల్ పీఠం బీఆర్‌ఎస్ కై వసం అయింది. అనూహ్య పరిణామాల మధ్య చైర్‌పర్సన్‌గా బొంది రజనీ, వైస్ చైర్‌పర్సన్‌గా కొక్కొండ సమత ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉండడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగిపోతుందని అంతా భావించారు. కానీ బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు ఏర్పడటం.. దీనిని కాంగ్రెస్, బీజేపీలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్‌లోనూ చైర్మన్‌గిరి ఎవరికి ఇవ్వాలనే దానిపై చివరిదాక టెన్షన్ నెలకొంది. కాగా, బీఆర్‌ఎస్ నుంచి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బొంది రజనీ పేరును అదే పార్టీ కౌన్సిలర్ కొక్కండ సమత ప్రతిపాదించగా.. మరో కౌన్సిలర్ సత్యలింగం బలపరిచారు. తొమ్మిది మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లలో ఎనిమిది మంది మాత్రమే చేతులేత్తారు. ఒక ఓటు తగ్గింది. అనూహ్యంగా బీజేపీ కౌన్సిలర్ మన్నే స్వామి కూడా రజనికి మద్దతు తెలిపాడు. దీంతో మ్యాజీక్ ఫిగర్ సాధించిన రజనీని చైర్‌పర్సన్‌గా గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. వైస్ చైర్మన్‌గా సమత ఎన్నికయ్యారు.
ఆద్యంతం.. ఆసక్తికరం
చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా ఆద్యంతం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని అందిపుచ్చుకోవాలని కాంగ్రెస్, బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేశాయి. ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు మోహరించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా గట్టి చర్యలు చేపట్టారు. చివరకు ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
తూప్రాన్ చైర్‌పర్సన్‌గా రజనీ


