పటిష్టంగా భూ రికార్డులు
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): ప్రతీ కమతానికి సరైన హద్దులు నిర్ణయించి పటిష్టమైన భూ రికార్డులను నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. భూ భారతి చట్టం, భూముల రీసర్వే కోసం పైలెట్ పంచాయతీగా ఎంచుకున్న మెదక్ మండలంలోని పాషాపూర్‌లో గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి, భూముల రీసర్వే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు పక్కాగా భూ హద్దులు, నక్ష, మ్యాప్‌లను నిర్ణయించి, పటిష్టమైన భూ రికార్డులను తయారు చేయడమేనని అన్నారు. ప్రతి కమతానికి రీసర్వే చేసి రైతులకు భూ తగాదాలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సర్వేతో భూ హద్దులు చెరిగిపోకుండా ఉంటాయని, భూమి ఆక్రమణకు గురి కాకుండా ఉంటుందన్నా రు. ఈ గ్రామాన్ని నమూనాగా తీసుకొని జిల్లాలోని మరో 23 గ్రామాల్లో భూముల రీసర్వే చేసి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, సర్పంచ్ నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.


