
జిల్లాలో అపార నష్టం కలిగించిన వర్షాలు
పక్కకు ఒరిగిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో మెతుకుసీమకు అపారనష్టం జరిగింది. 77 కిలోమీటర్ల పొడవు పీఆర్, ఆర్‌అండ్‌బీ రోడ్లు ధ్వంసం కాగా, 92 చెరువులు, కుంటలు, కల్వర్టులు తెగిపోయాయి. వేలాది విద్యుత్ స్తంభాలు, వందలాది ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఈ నాలుగు శాఖల పరిధిలో రూ. 18.60 కోట్ల పైచిలుకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇదిలాఉండగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి.
– మెదక్‌జోన్
వరుణుడి ప్రతాపానికి మెతుకుసీమ అతలాకుతలం అయింది. వరద ఉధృతితో చెరువులు, కుంటలు, బ్రిడ్జిలు, కల్వర్టులు, మొత్తం 92 ధ్వంసం అయ్యాయి. ఇందులో ప్రధానంగా లింగసాన్‌పల్లి ఊరచెరువు, అవుసులపల్లి ఖజానచెరువు, కొచ్చెరువుతో పాటు అనేక నీటి వనరులు తెగిపోయాయి. ఇరిగేషన్‌శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం రూ. 2 కోట్ల నష్టం సంభవించింది. అలాగే పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో 63 కిలోమీటర్ల మేర 14 రోడ్లు ధ్వంసం అయ్యాయి. 15 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. పలు కల్వర్టులు తెగిపోయాయి. అత్యవసరంగా 29 చోట్ల మరమ్మతులు చేయాల్సి ఉంది. అధికంగా హవేళిఘణాపూర్ మండల పరిధిలోని బ్యాతోల్, ఫరీద్‌పూర్‌లో రోడ్లు ధ్వంసం అయ్యా యి. వీటికి సైతం మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో సుమారు రూ. 4.40 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
వాగులు పారి.. దారులు తెగి
ఆర్‌అండ్‌బీశాఖ పరిధిలో 29 రోడ్లకు సంబంధించి 53 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. అత్యధికంగా మెదక్ సమీపంలోని పిల్లికొటాల్– వెల్దుర్తి రోడ్డు, చిన్నశంకరంపేట మండలం టీ. మాందాపూర్, శివ్వంపేట మండల పరిధిలోని చండి రోడ్లు దెబ్బతినగా, వీటికి వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. సుమారు రూ. 2.60 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఆశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే అత్యధికంగా నష్టం జరిగిన శాఖలో మొదటిది విద్యుత్‌శాఖ. దీని పరిధిలో 1,344 విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యా యి. 460 ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగాయి. 3 పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లు, 1 సబ్‌స్టేషన్‌తో పాటు 51 కిలోమీటర్ల పొడవునా విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. మొత్తంగా రూ. 10 కోట్ల నష్టం జరిగినట్లు ఆశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నష్టం మ రింతగా పెరిగే అవకాశం ఉంది. హవేళిఘణాపూర్ మండలం దూప్‌సింగ్ తండా వరద ముంపులోనే ఉంది. వరద తగ్గాక ఆ గ్రామంలో పడిపోయిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఎన్ని అనే విషయం తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా 681 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, అందులో 4 ఇళ్లు నేలమట్టం అయినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
ధూప్‌సింగ్ తండాలో నేలవాలిన చెరుకు పంట
ప్రాథమిక అంచనా ప్రకారం
రూ. 18.60 కోట్ల మేర నష్టం
అత్యధికంగా విద్యుత్‌శాఖకు..
దెబ్బతిన్న 1,344 స్తంభాలు,
460 ట్రాన్స్‌ఫార్మర్లు
77 కిలోమీటర్ల మేర పీఆర్,
ఆర్‌అండ్‌బీ రోడ్లు ధ్వంసం
92 చెరువులు, కుంటలకు గండ్లు,
తెగిన కల్వర్టులు

జిల్లాలో అపార నష్టం కలిగించిన వర్షాలు