
త్వరగా ‘ట్రాక్’లో పడేనా..!
రామాయంపేట(మెదక్): భారీ వర్షాలతో మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రెండు చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో మేడ్చల్– నిజామాబాద్, అక్కన్నపేట– మెదక్ రూట్లలో 38 రైళ్లను ఆశాఖ అధికారులు రద్దు చేశారు. అక్కన్నపేట– మెదక్ మార్గంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రైళ్లు నడుస్తాయి. వరద పోటెత్తడంతో హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్ వద్ద ట్రాక్ కింద కంకర, మొరం లేచిపోయి పట్టాలు గాలిలో తేలాయి. మేడ్చల్– నిజామాబాద్ మార్గంలో తలమడ్ల వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో రెండు మార్గాల్లో రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. దీంతో ఎల్లవేళలా రద్దీగా ఉండే పలు స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. జిల్లా మీదుగా దూర ప్రాంతాలకు వెళ్లే అజంతా, దేవగిరి, కృష్ణ, జైపూర్, ఓకా, అమరావతి, నాగర్సోల్, రాజస్థాన్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. తలమడ్ల వద్ద వంద మంది రైల్వే సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. శనివారం లోపు రైళ్లు ప్రారంభం కావొచ్చని ఆశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా మెదక్ మార్గంలో ఇతర రైళ్లు నడువకపోవడంతో అధికారులు తాత్సా రం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శమ్నాపూర్ వద్ద ట్రాక్ మరమ్మతులకు కనీసం రెండు, మూడు రోజులు పట్టనున్నట్లు సమాచారం.
శమ్నాపూర్ వద్ద
ప్రారంభం కాని మరమ్మతులు