
విద్యుత్ కోతలపై రైతన్న ఆగ్రహం
రేగోడ్(మెదక్): వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ను సోమవారం రైతులు ముట్టడించారు. ఈసందర్భంగా చౌదర్‌పల్లి, కొత్వాన్‌పల్లి, మర్పల్లి గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడుతూ.. కరెంట్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ కోసం రాత్రి సమయంలో పొలాల వద్దే ఉంటూ అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. 15 రోజులుగా మోటార్లు కాలిపోతూ ఆర్థికంగా నష్టపోతున్నామన్నారు. 18 గంటల పాటు నిరంతరాయంగా త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పోచయ్య ఏఈకి సమస్యను వివరించి రైతులను శాంతింపచేశారు. ఇదే విషయమై ట్రాన్స్‌కో ఏఈ యాసిన్‌అలీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలతోనే కరెంట్ సరఫరా చేస్తున్నామని, రైతుల సమస్యను ఉన్నతాధికారులకు తెలియజెస్తామని పేర్కొన్నారు.