
నిబంధనలు పాటించాలి
మెదక్ మున్సిపాలిటీ: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నేరాల పరిస్థితి, శాంతిభద్రతల పర్యవేక్షణ, పెండింగ్ కేసుల పరిష్కారం వంటి అంశాలపై సమీక్షించారు. పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. మండపాల వద్ద రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు వాడకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసి, ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రేవ్ కేసులు వేగంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
ఆధునిక సాంకేతిక పద్ధతులు
ముఖ్యంగా మహిళలు, పిల్లలపై నేరాల దర్యాప్తు వేగవంతం చేసి, కోర్టుల్లో చార్జిషీట్లు సకాలంలో సమర్పించి కన్విక్షన్ రేట్ పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సైలు, ఇనన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలని, కేసుల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. నమోదైన అన్ని కేసులను సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించి త్వరగా పరిష్కరించాలని, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా నేరాలను అరికట్టడం మరియు నేరస్తులను త్వరగా గుర్తించడం సాధ్యం అవుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్ నరేందర్ గౌడ్ , సుభాష్ చంద్ర బోస్ తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉంటాం
నర్సాపూర్: డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు విద్యార్థులకు హితవు పలికారు. మంగళవారం స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ క్రైం, ర్యాగింగ్ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅథితిగా పాల్గొని మాట్లాడారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలతో ఆరోగ్యం పాడవడంతో పాటు కుటుంబమంతా సంక్షోభంలోకి వెళ్తుందన్నారు. సైబర్ నేరాలపై ప్రజలను చైతన్య వంతులను చేయాలని సూచించారు. తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేయొద్దని సూచించారు. ర్యాగింగ్ చేస్తే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యార్థులతో డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైం డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, స్థానిక సీఐ జాన్‌రెడ్డి, ఎస్‌ఐ లింగం, కాలేజీ ప్రతినిధులు పాల్గొన్నారు.
రాత్రి 10 గంటల తర్వాత
లౌడ్ స్పీకర్లు వాడకూడదు
గణేశ్ మండపాల నిర్వాహకులకు
ఎస్పీ శ్రీనివాసరావు సూచన
ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక