
రూ.3 కోట్లకుపైగా బకాయిలు
మెదక్‌జోన్: రేషన్ బియ్యానికి సంబంధించిన కమీషన్‌ను ప్రభుత్వం డీలర్లకు ఇవ్వకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలకు సంబంధించి డీలర్లకు రూ.3 కోట్లకు పైగా బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో రేషన్ దుకాణాలు నడపడంలోనూ, కుటుంబాలు పోషించుకోవడంలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ నెలాఖరుకల్లా కమీషన్ బకాయిలు చెల్లించకుంటే ఆందోళనబాట పడతామని డీలర్లు హెచ్చరిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 520 రేషన్ దుకాణాలు
జిల్లావ్యాప్తంగా 520 రేషన్ దుకాణాలు ఉండగా ప్రతీ నెల 4,800 మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని 490మంది డీలర్లు పంపిణీ చేస్తున్నారు. క్వింటాకు రూ.140 చొప్పున డీలర్‌కు కమీషన్ ఇస్తోంది. ఇందులో కేంద్రం రూ.90, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 చొప్పున చెల్లిస్తున్నాయి. సకాలంలో కమీషన్ ఇవ్వకపోవడంతో రేషన్ దుకాణాల అద్దె, కరెంట్ బిల్లులు, స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని డీలర్లు వాపోతున్నారు. రేషన్‌షాపులను డీలర్లు అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. ప్రతీ నెల వీటికి అద్దె చెల్లించడంతోపాటు బియ్యం కోటా రాగానే వాహనాల్లోనుంచి బియ్యం దించేందుకు హమాలీలకు కూలీ చెల్లిస్తున్నారు.
ఐదు నెలలుగా అందని కమీషన్
ఆందోళనబాటలో రేషన్ డీలర్లు
గతంలో 9 రకాల సరుకులు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కన్నా ముందు రేషన్‌షాపులకు బియ్యంతోపాటు కిరోసిన్, పప్పులు, పంచదార వంటి సరుకులను రేషన్ ఇచ్చేవారు. దీంతో సదరు డీలర్‌కు సైతం అన్ని రకాల వస్తువులపై కమీషన్ వచ్చేది. ప్రస్తుతం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుండటంతో వచ్చే కమీషన్ కనీసం హమాలీల కూలీ కూడా రావడం లేదని వాపోతున్నారు.