
రోడ్డెక్కిన రైతన్న
నర్సాపూర్: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. రాత్రనక.. పగలనక వారు పడుతున్న ఇబ్బందులు వర్ణానాతీతం. యూరియా కోసం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు మంగళవారం ఉదయమే ఆయా గ్రామాల రైతులు చేరుకున్నారు. తీరా యూరియా రాదని తెలియడంతో కోపోద్రిక్తులై రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అన్ని మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. చౌరస్తా మీదుగా శివ్వంపేట మండలానికి వెళుతున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి.. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు సైతం రైతులకు మద్దతుగా నిలిచారు. తహసీల్దార్ శ్రీనివాస్ వచ్చి రాస్తారోకో విరమించాలని కోరగా.. ఎమ్మెల్యే సునీతారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదని ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ నిలదీశారు. కాగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, స్థానిక సీఐ జాన్‌రెడ్డి, ఎస్‌ఐ లింగం సముదాయించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రైతుల గోస పట్టదా..?
రాష్ట్రంలో నికృష్ట పాలన కొనసాగుతోందని, రైతుల గోస పట్టడంలేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి మండిపడ్డారు. మంగళవారం యూరియా కోసం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన రైతులకు సంఘీభావం తెలిపారు. వారితో పాటు రోడ్డుపై బైఠాయించారు. ఆమెను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించగా అక్కడ విలేకరులతో మాట్లా డారు. యూరియా కావాలని అడిగితే అరెస్టులు చేయడం తగదన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల అవసరం మేరకు కేసీఆర్ యూరియా సరఫరా చేశారని గుర్తు చేశారు. యూరియా సరఫరాలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పాస్‌బుక్కులు, ఆధార్‌కార్డుల జిరాక్స్‌లు క్యూలో పెట్టి రోజుల తరబడి నిరీక్షిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కొందరు యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి మండలానికి మూడు లారీల యూరియాను వెంటనే సరఫరా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటామన్నారు.
యూరియా కోసం రాస్తారోకో
సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే
స్తంభించిన వాహనాల రాకపోకలు
రాష్ట్రంలో నికృష్ట పాలన: సునీతారెడ్డి

రోడ్డెక్కిన రైతన్న