
సాక్షి, కామారెడ్డి: భారీ వర్షాలు నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో రేపు(గురువారం) విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నారు.

ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డిలో రికార్డు స్థాయిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి-నిజామాబాద్ మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.

నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామంలోకి మంజీర వరద నీళ్లు చేరుతున్నాయి. గ్రామ శివారులో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వర్షాలు, వరదలు తగ్గించాలంటూ వేడుకొంటూ గంగమ్మ తల్లికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతించాలని కోరుతూ మంజీర నదిలో తెప్ప పడవను గ్రామస్తులు వదిలారు.
