మెదక్‌ జిల్లాలో కుంభవృష్టి.. బిల్డింగ్‌ ఎక్కి కాపాడాలంటూ ఆర్తనాదాలు.. | Heavy Rains Lash Telangana: Hyderabad Flooded, IMD Issues Orange Alert for Several Districts | Sakshi
Sakshi News home page

మెదక్‌ జిల్లాలో కుంభవృష్టి.. బిల్డింగ్‌ ఎక్కి కాపాడాలంటూ ఆర్తనాదాలు..

Aug 27 2025 12:41 PM | Updated on Aug 27 2025 12:58 PM

Heavy Rain Fall In Medak District

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ధూప్‌సింగ్‌ తండా జలమయమైంది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. జల దిగ్భందంలో తండా ఉండటంతో తమ కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్‌పైకి ఆర్తనాదాలు చేస్తున్నారు. 

మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తెలంగాణలోని పలు జిల్లాలో మంగళవారం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌, కొండాపూర్‌, రాయదుర్గం, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, మేడ్చల్‌, శామీర్‌పేట్, నగరంలోని లింగంపల్లి, మియాపూర్‌, గచ్చిబౌలి,  తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది.

ఉమ్మడి మెదక్‌లో కుండపోత.. 
మెదక్‌ జిల్లా టెక్మాల్‌లో అత్యధికంగా 19.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో 18 సెం.మీ, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌లో 16.48 సెం.మీ, యాదాద్రి జిల్లా భువనగిరిలో 14.93 సెం.మీ, మహబూబ్‌నగర్‌లోని భూత్పూర్‌లో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌల్తాబాద్‌లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంజీరా నదికి భారీగా వరద రాబోతుందని అంచనా వేసింది.

ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, మోటకొండూర్‌, తుర్కపల్లి, బొమ్మలరామారంలో వర్షం కురుస్తోంది. భువనగిరి మండలం నందనంలో భారీ వర్షం కురిసింది. సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచింది.

వికారాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూర్‌, పాల్వంచ, పిట్లం, నిజాంసాగర్‌, భిక్కనూరు, లింగంపేటలో వర్షం కురుస్తోంది. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్‌ వద్ద కల్వర్టు తెగింది. దీంతో రోడ్డు దెబ్బతిని ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

వాతావరణ శాఖ అలర్ట్‌.. 
హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు వినాయక మంటపాలకు వెళ్లేటపుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో లైటింగ్ సెట్లు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement