
సాక్షి, మెదక్: కనీవినీ ఎరుగని రీతిలో మెతుకుసీమ చరిత్రలో లేనంతగా వరుణుడు వణికించేస్తున్నాడు. ఇప్పటికే పలు గ్రామాలు, తండాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఫ్లాష్‌ఫ్లడ్స్ హెచ్చరికల నేపథ్యంలో నీటి ఉపద్రవం తమను ముంచెత్తుతుందో అని జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
భారీ వర్షాలతో మెదక్ ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రేగోడ్ (మం) మర్పల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియల కోసం ఓ కుటుంబం, గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గొల్ల వాగు వరద నీటి ప్రవాహా ఉదృతితో జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
గత రెండు రోజులుగా మెదక్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి. గజ్వేల్, నారాయణఖేడ్, సిద్దిపేట ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లు దెబ్బ తినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరి, మక్క, కందుల పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టం అంచనా వేస్తున్నారు. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని జాగ్రత్తలు చెబుతోంది.