
స్తంభానికి చేతులు కట్టేసి ఉండగా, తలకు గాయమైన స్థితిలో గుర్తించిన పోలీసులు
హుటాహుటిన మెదక్ ఆస్పత్రికి తరలింపు... మెరుగైన చికిత్సకు గాంధీకి తరలిస్తుండగా మృతి
మెదక్ జిల్లాలో ఘటన
మెదక్‌జోన్/కొల్చారం(నర్సాపూర్): ఏడుపాయల పుణ్యక్షేత్ర సమీపంలో ఘోరం జరిగింది. ఆలయానికి అతి సమీపంలోని ఓ వెంచర్ పక్కన ముళ్ల పొదల్లో గిరిజన మహిళపై అత్యాచారం చేశారు. ఆపై గుర్తుతెలియని దుండగులు తీవ్రంగా కొట్టడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది.
మెదక్ రూరల్ సీఐ జార్జ్, బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం సంగాయిగూడ తండాకు చెందిన గిరిజన మహిళ భర్త, పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. దంపతులిద్దరూ అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు. భర్త రెండు రోజుల క్రితం పని ఉండటంతో గజ్వేల్‌కు వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే ఆమె పనికోసం టిఫిన్ బాక్స్ పట్టుకొని ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కొడుకు తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ఇంటికి వచ్చిన భర్త తన భార్య కోసం అంతటా వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంతలోనే శనివారం ఉదయం 10 గంటల సమయంలో పోలీసుల ద్వారా విషయం తెలిసింది. ఘటనాస్థలిని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. ఆ మహిళను వెంచర్‌లోని స్తంభానికి చేతులు కట్టేసి ఉంచగా, తలకు బలమైన గాయం, కుడిచేయి విరిగి ఉంది. మెడ, ఇతర చోట్ల గాయాలు ఉన్నాయి. వెంటనే పోలీసులు హుటాహుటిన మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
రాత్రి 7 గంటల వరకు చికిత్స అందిస్తున్నా స్పృహాలోకి రాలేదు. పరిస్థితి విషమించటంతో వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. వైద్యులు గిరిజన మహిళపై అత్యాచారం చేసిన తర్వాతే దాడి చేసి ఉంటారని చెబుతున్నారు. ల్యాబ్‌కు శాంపిల్స్ పంపామని రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.