టికెట్ ధరలో గందరగోళం
రౌండప్ పేరిట జేబుకు చిల్లు
కౌంటర్‌లో రూ.30, ఆన్‌లైన్ రిజర్వేషన్ రూ.50 ఎక్కువ
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు చార్జీల భారం మోపుతోంది. ప్రయాణ దూరాన్ని బట్టి ఒకేసారి కచ్చితమైన టికెట్ ధర నిర్ణయించాల్సి ఉండగా.. బేసిక్ చార్జీ, టోల్‌గేట్, వాటర్‌బాటిల్, సేఫ్టీ సెస్ అంటూ విడివిడిగా వసూలు చేస్తోంది. రౌండ్‌ప్ పేరిట ఒకే టికెట్‌పై రెండుసార్లు అదనంగా బాదుతోంది. మంచిర్యాల నుంచి హైదరాబాద్ జేబీఎస్‌కు లగ్జరీ బస్సులో బేసిక్ చార్జి రూ.406 నిర్ణయించారు. మూడు టోల్‌గేట్ల చార్జీలు రూ.26చొప్పున రూ.78, వాటర్‌బాటిల్‌కు రూ.10, సెస్ రూ.1 మొత్తంగా రూ.89 అవుతుంది. ఇవన్నీ కలిపితే టికెట్ ధర రూ.495 కావాలి. కానీ ఆర్టీసీ నిబంధనల ప్రకారం రూ.89ను రూ.90కి రౌండప్ చేయడంతో రూ.496 అవుతుంది. దీనిని రెండోసారి రౌండప్ చేసి రూ.500 వసూలు చేస్తున్నారు. ఒకే టికెట్‌పై రెండుసార్లు రౌండప్ చేయడంతో ప్రయాణికుల అదనంగా చెల్లించాల్సి వస్తోంది. బస్సులో టికెట్ తీసుకుంటే రూ.500 కాగా, రిజర్వేషన్ కౌంటర్‌లో అయితే రూ.30 అదనపు చార్జీతో కలిపి రూ.530 చెల్లించాల్సి వస్తుంది. ప్రైవేటులో రెడ్‌బస్, ఇతర ప్రైవేటు వెబ్‌సైట్‌లో టికెట్ తీసుకుంటే రూ.20 అదనపు చార్జీ పడడంతో టికెట్ ధర రూ.550కి చేరుతుంది.
విడివిడి ఛార్జీలపై అభ్యంతరం
చిల్లర్ల సమస్య రాకుండా రౌండప్ చేస్తున్నామని ఆ ర్టీసీ చెబుతున్నా ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ కలిపి నిర్ధిష్టమైన టికెట్ ధర రూ.500 నిర్ణయించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.
వాటర్‌బాటిల్ వద్దన్నా చార్జీ తగ్గదు
బస్సులో ప్రయాణికులు ఎవరూ వాటర్‌బాటిల్ అ డగరు. ఎవరైనా వద్దన్నా ఆ మేరకు బాటిల్ ధర రూ.10 తగ్గించరు. దీనికి తోడు ఆన్‌లైన్ రిజర్వేషన్‌తో ప్రయాణికులకు రూ.30 అదనపు భారం పడుతోంది.
మంచిర్యాల నుంచి
లగ్జరీ బస్సు బేసిక్ టికెట్ ధర–బస్సులో ధర–రిజర్వేషన్ కౌంటర్
మియాపూర్ రూ.424 రూ.530 రూ. 560
ఎంజీబీఎస్ రూ.424 రూ.530 రూ. 560
లహరీ ఏసీ
మియాపూర్ రూ.699 రూ.870 రూ. 900
నాన్ ఏసీ మియాపూర్ రూ.514 రూ.690 రూ.720
ప్రయాణికుడు నేరుగా ఆన్‌లైన్‌లో రెడ్‌బస్, అభిబస్ వంటి ప్రైవేట్ సైట్‌లో టికెట్ బుకింగ్ చేస్తే రూ.20 అదనం.
టోల్‌చార్జీ మినహాయిస్తే..
ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీ బస్సులకు ప్రభుత్వం టోల్‌చార్జీలు మినహాయిస్తే ప్రయాణికులపై భారం తగ్గుతుంది. టోల్‌చార్జీ రూ.78, వాటర్‌బాటిల్ రూ.10 రద్దు చేస్తే ఒక్కో ప్రయాణికుడిపై రూ.88 తగ్గుతుంది. ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి విడివిడి వసూళ్లకు స్వస్తి పలకాలని ప్రయాణికులు కోరుతున్నారు.


