కార్పొరేషన్‌తో ఒప్పందాలకు వెనుకడుగు
పలు నిబంధనలు సడలించాలని వినతులు
గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన ధాన్యం రాక
జిల్లాలో ఇంకా మొదలు కాని వడ్ల కొనుగోళ్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్ల ఆరంభంలోనే మిల్లర్లు ఒప్పందానికి సంసిద్ధంగా లేరు. ఓ వైపు ప్రైవేటు వ్యాపారులే ధాన్యం తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇంకా పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ మొదలు కాలేదు. వడ్లకు డిమాండ్ ఉండడంతో రైతులు నేరుగా ప్రైవేటు వ్యాపారులతోనే ఒప్పందం చేసుకుని విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌తో మిల్లర్లు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. 2026–27ఖరీఫ్(వానాకా లం) ధాన్యం కేటాయింపుల్లో కొత్తగా పలు నిబంధనలు చేర్చింది. వీటిలో సర్కారు మద్దతు ధర, బోనస్‌తో సేకరిస్తున్న ఏడు సన్న రకాల వడ్లను మిల్లుల్లో వేర్వేరుగా భద్రపర్చాలనే ప్రధాన నిబంధన ఉంది. కొనుగోలు కేంద్రాలకు మిల్లర్ల ప్రతినిధిని ముందే పంపి ధాన్యం కస్టం మిల్లింగ్ రైస్ నాణ్యత, పరిమాణాల నిర్ణయం, కేటాయించిన ధాన్యానికి ఐదు రేట్ల సాల్వేన్సీ సర్టిఫికెట్(మిల్లర్ ఆర్థిక స్థితి ధ్రువపత్రం) ఇవ్వాల్సి రావడం, ష్యూరిటీ కింద మిల్లుల యజమానుల పరస్పర అంగీకారం ఇవ్వాలి. ఇవేకాకుండా అధికారులు మిల్లుల్లో తనిఖీల్లో పది శాతం ధాన్యం తేడా వచ్చినా షార్టేజీ(కొరత) ఉన్నట్లు చూడొద్దు. ఈ డిమాండ్లను మిల్లర్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముందుంచారు. ఈ నిబంధనలన్నీ రాష్ట్ర స్థాయిలో అమలు కావడంతో మినహాయింపులేవీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.


