ఆస్పత్రిలో అభద్రత! | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో అభద్రత!

Nov 21 2026 12:08 AM | Updated on Nov 21 2026 12:08 AM

● పోలీసు అవుట్‌పోస్టు లేక ఇబ్బందులు ● రోగులు, వ్యక్తుల గొడవలతో సతమతం

బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిలో అభద్రతాభావం నెలకొంది. ఏ చిన్న విషయమైనా రోగులు, వెంట వచ్చే వ్యక్తులు గొడవలకు దిగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నెలలో రెండు మూడు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోజువారీగా వందల సంఖ్యలో రోగులు ఆస్పత్రికి వస్తుండగా.. తరచూ జరుగుతున్న గొడవలతో సతమతం అవుతున్నారు. పోలీసు అవుట్‌పోస్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉన్నా నెరవేరడం లేదు. వైద్యం కాస్త ఆలస్యమైనా, వరుసలో ఉండాలన్నా, బెడ్‌ దొరకకపోయినా, చివరికి వైద్యులు రాసిన మందుల్లో ఏ ఒక్కటి లేకపోయినా కొందరు వ్యక్తులు వైద్యులు, సిబ్బందిపై విరుచుకు పడుతున్నారు. నిలదీయడం, దూషించడం, ఒక్కోసారి చేయి చేసుకునే వరకూ వెళ్లడం సర్వసాధారణంగా మారింది. రాత్రివేళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. మద్యంమత్తులో వచ్చే వ్యక్తులు, గొడవలకు దిగే వ్యక్తుల వల్ల మహిళా సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. రెండు నెలల క్రితం ఓ మహిళ మందులు లేనప్పుడు ప్రిస్కిప్షన్‌ ఎందుకు రాశారంటూ వైద్యులు, సిబ్బందిపై దాడి చేసినంత పని చేసింది. నానా హంగామాతో వైద్యులు, సిబ్బంది బెదిరిపోయారు. రోడ్డు ప్రమాదం జరిగి, ఘర్షణ పడి ఆస్పత్రికి వచ్చే వ్యక్తులు చాలా వరకు మద్యంమత్తులో ఉండి ఇష్టారీతిగా మాట్లాడడం, వైద్యులు, సిబ్బంది చెప్పిన విషయాలేవీ పట్టించుకోపోవడం, దురుసుగా వ్యవహరించడం మామూలై పోయింది. పోలీసు అవుట్‌ పోస్టు ఉంటే చాలావరకు గొడవలు జరిగే అవకాశాలు ఉండవని, గొడవలు చేసే వారిలో భయం ఉటుందని, వైద్యులు నిర్భయంగా వైద్యం చేయడానికి వీలుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అత్యవసరానికి ఫోన్‌ నంబర్‌ లేదు

ఆస్పత్రిలో ఫోన్‌ అందుబాటులో లేకపోవడం రోగులను ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో ఆస్పత్రికి ఒక ఫోన్‌ నంబరు ఉండేది. ఆ నంబరుకు అనవసర ఫోన్లు రావడం, అసభ్యంగా మాట్లాడుతూ మహిళా సిబ్బందిని వేధించడంతో ఆ నంబరును అందుబాటులో లేకుండా చేశారు. దీంతో కొత్త వ్యక్తులు, బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆస్పత్రి ఫోన్‌ నంబరు తెలియకుండా పోయింది. అర్ధరాత్రి ప్రమాదం జరిగినా, ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను తీసుకు రావాలన్నా ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకునే వీలు లేదు. దీంతో ప్రజలు నేరుగా ఆస్పత్రికి రావాల్సి వస్తోంది.

అవుట్‌ పోస్టు కోసం సీపీని కోరాం

ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి లో పరిణామాలు, గొడవల దృష్ట్యా పోలీసు అవుట్‌పో స్టు ఏర్పాటు చేయాలని రా మగుండం పోలీసు కమిషనర్‌ను కోరాం. అధికారికంగా రెండుసార్లు ఉత్తరాలు కూడా రాశాం. పోలీసు శాఖ నుంచి ఇంతవరకు సానుకూలత రాలేదు. పోలీసు అవుట్‌ పోస్టు ఏర్పాటు చేయడం అన్ని విధాల ఉపయోగకరం. – జి.రవి, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, బెల్లంపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement