మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా గ్రంథాలయాల ఏర్పాటుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 21 పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో గ్రంథాలయ అభివృద్ధికి రూ.15వేలు కేటాయించింది. పత్రికలు, మేగజైన్‌ల కోసం నెలకు రూ.వెయ్యి చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధులను ఆయా పాఠశాల బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
ఏర్పాటు ఇలా..
మొదటి విడత ఎంపిక చేసిన 21పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు రూ.15వేల చొప్పున కేటాయించారు. వీటితో గ్రంథాలయంలో ఫర్నిచర్, పెయింటింగ్, విద్యుత్ మరమ్మతులు, కూర్చునేందుకు వీలుగా టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు కొనుగోలు తదితర వాటికి వెచ్చించాల్సి ఉంటుంది. పుస్తకాల ర్యాకులు, అల్మారాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు అవసరమైన కథలు, సైన్స్, జీవిత చరిత్ర పుస్తకాలు అందుబాటులో ఉంచాలి.
పఠనాసక్తి పెంపు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులోకి వచ్చి పఠనాసక్తి, పోటీ పరీక్షల సామర్థ్యం పెంపొందుతుంది. పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా కథలు, నవలలు, విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత వికసిస్తుంది. జనరల్ నాలెడ్జ్, కరెంటు అఫైర్స్, వివిధ ప్రవేశ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచడం వల్ల భవిష్యత్‌లో పోటీ పరీక్షలను ఎదుర్కోవడం సులువు కానుంది. భాషానైపుణ్యం మెరుగవుతుంది. తెలుగు, ఇంగ్లిషు భాషలపై పట్టుతోపాటు కొత్త పదజాలం నేర్చుకోవడానికి గ్రంథాలయాలు తోడ్పడుతాయి. సొంతంగా విషయాలు శోధించి నేర్చకునే అలవాటు విద్యార్థుల్లో ఏర్పడుతుంది. సెల్‌ఫోన్లు, టీవీలు, డిజిటల్ మాధ్యమాలకు బదులుగా పుస్తకాల వైపు దృష్టి మళ్లి విద్యార్థుల్లో ఏకాగ్రత మెరుగు పడుతుంది. పోటీ పరీక్షల సన్నద్ధం కోసం ఖరీదైన పుస్తకాలు కొనుగోలు చేయలేని పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఎంపికై నవి ఇవే..
మంచిర్యాల జెడ్పీహెచ్‌ఎస్ బాలికలు, బాలుర, ప్రభుత్వ ఉన్నత పాఠశాల చెన్నూర్ రోడ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్మిళ్ల, జన్నారం మండలం కిష్టాపూర్, కలమడుగు జెడ్పీహెచ్‌ఎస్‌లు, లక్సెట్టిపేట జెడ్పీహెచ్‌ఎస్ బాలికలు, బాలుర, జైపూర్, ఇందారం, బెల్లంపల్లి(బాలికల) జెడ్పీహెచ్‌ఎస్‌లు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల బెల్లంపల్లి, హాజీపూర్ మండలం సబ్బెపల్లి, ముల్కల్ల జెడ్పీహెచ్‌ఎస్‌లు, కన్నెపల్లి, తాండూర్, భీమిని, నెన్నెల, వెల్గనూర్, మందమర్రి(బాలుర) జెడ్పీహెచ్‌ఎస్‌లు గ్రంథాలయాల ఏర్పాటుకు ఎంపికయ్యాయి.
పోటీపరీక్షలకు సన్నద్ధం
పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయవచ్చు. సాహిత్యం, సాధారణ జ్ఞానంపై పట్టు సాధించేలా లైబ్రరీలు ఎంతగానో దోహదపడుతాయి. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచి విజ్ఞానాన్ని విస్తృతం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. – చంద్రయ్య, డీఈవో


