డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌పై వేటు
నాగర్‌కర్నూల్ జీజీహెచ్‌కు బదిలీ
ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బలరాం చిక్టే
ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా వెంకట్ లకావత్
వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ రిమ్స్ ఇన్‌చార్జి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌పై బదిలీ వేటు పడింది. గత రెండు నెలలుగా రిమ్స్‌లో వరుస ఘటనల నేపథ్యంలో బదిలీ జరిగింది. రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూలో సెప్టెంబర్ 21న అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఐదుగురు నవజాత శిశువులు మృతిచెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం, ప్రభుత్వం విచారణకు ఆదేశించడం తెలిసిందే. రిమ్స్ అధికారులపై చర్యలు చేపడుతారనే చర్చ జోరుగా సాగినా పరిస్థితి చల్లబడింది. ఆ తర్వాత గర్భిణి, బాలింతలు, శిశువులు మృతిచెందడం, నర్సింగ్ ఆఫీసర్‌పై చెట్టు కొమ్మ విరిగి పడడం, మరో వైద్యురాలు ఆసుపత్రిలో పడి చేయి విరగడం.. ఇటీవల వైద్యుని నిర్వాకంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు గుట్టుచప్పుడు కాకుండా భర్తీ చేయడంపైనా విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయనపై బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డైరెక్టర్‌తోపాటు ఆసుపత్రిని గాడిన పెట్టేందుకు సూపరింటెండెంట్ పోస్టును సైతం రెగ్యులర్ అధికారితో భర్తీ చేసింది. డైరెక్టర్‌గా జిల్లా వాసిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
డైరెక్టర్‌గా బలరాం చిక్టే
రిమ్స్ ఇంచార్జీ డైరెక్టర్‌గా జిల్లాకు చెందిన బలరాం చిక్టేను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయనకు బాధ్యతలు అప్పగించింది. జిల్లా ఆసుపత్రిగా ఉన్న సమయంలో ఆయన వైద్యుడిగా సేవలందించారు. ఈయనతోపాటు ఇదివరకు రెండు పోస్టులు ఒక్కరే నిర్వర్తించగా తాజా ఘటనలతో ఆసుపత్రి రెగ్యులర్ సూపరింటెండెంట్‌నూ నియమించారు. ఆసిఫాబాద్ జిల్లా వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వెంకట్ లకావత్‌కు సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించారు.
నాగర్‌కర్నూల్ జీజీహెచ్‌కు జైసింగ్
అర్థోపెడిక్ ప్రొఫెసర్‌గా రిమ్స్‌లో విధుల్లో చేరిన జైసింగ్ రాథోడ్ నాలుగేళ్ల నుంచి ఇన్‌చార్జి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రత్యేక విచారణ చేపట్టిన ప్రభుత్వం వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆయనపై బదిలీ వేటు వేసింది. నాగర్‌కర్నూల్ జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా జడ్‌చోంగ్త్ ఉత్తర్వులు జారీ చేశారు.


