● పంట, సాగు రుణాలకు వెసులుబాటు ● చెల్లింపులో తాత్కాలికంగా నిలుపుదల ● జిల్లాలో వేలాది మందికి ఉపశమనం | - | Sakshi
Sakshi News home page

● పంట, సాగు రుణాలకు వెసులుబాటు ● చెల్లింపులో తాత్కాలికంగా నిలుపుదల ● జిల్లాలో వేలాది మందికి ఉపశమనం

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

● పంట, సాగు రుణాలకు వెసులుబాటు ● చెల్లింపులో తాత్కాలికంగా నిలుపుదల ● జిల్లాలో వేలాది మందికి ఉపశమనం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, పంట రుణాలపై మారటోరియం విధించడం రైతులకు ఊరట కలిగించింది. తీవ్ర, మధ్యస్థ కరువు జిల్లాల్లో నిబంధనల మేరకు పంట రుణాల చెల్లింపుల్లో వెసులుబాటు కల్పిస్తూ ఇటీవల రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో వేలాది మంది రైతులకు ఊరట లభించనుంది. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో ఇప్పటివరకు మొత్తం రుణ లక్ష్యంలో 50శాతం పంపిణీ చేయాల్సి ఉండగా, సెప్టెంబర్‌ నాటికి 40శాతానికి పైగా రుణాల పంపిణీ జరిగింది. వీటిలో స్వల్ప కాలిక పంట రుణాలు, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు ఉన్నాయి. పంట రుణాలు పంట కాలంలో తప్పనిసరిగా రెన్యూవల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే తక్కువ వడ్డీ వర్తించదు. ఇక వ్యవసాయ రుణాల్లో యంత్రాలు, ఇతర వాటి కోసం తీసుకున్న రుణాలు మూడు, ఆరు నెలలు, ఏడాదికోసారి వాయిదాల్లో చెల్లించాలి. తాజాగా ఎస్‌ఎల్‌బీసీలో నిర్ణయంతో ఖరీఫ్‌లో తీసుకున్న పంట రుణాలు స్వల్పకాలిక నుంచి దీర్ఘకాలిక అంటే వచ్చే ఏడాదిపాటు కట్టకుండా ఉండేలా వెసులుబాటు కలిగింది. కరువు కారణంగా రైతులు పంట రుణాలు చెల్లించలేకపోతున్న క్రమంలో పంటల నష్టం పూడ్చేందుకు ఈ సీజన్‌లో చెల్లించే మొత్తం మరో ఏడాదిపాటు వాయిదా పడనున్నాయి. దీర్ఘకాలిక రుణాలు ఉన్న వ్యవసాయ రుణాలు ఈ సీజన్‌లో చెల్లించే వాయిదా తాత్కాలికంగా నిలుపుదల కానుంది. ఆ తదుపరి వాయిదాలు యధావిధిగా చెల్లించాల్సి ఉంటుంది. వాయిదా పడిన మొత్తం తదుపరి వార్షిక సంవత్సరంలో తిరిగి రైతులు తప్పనిసరిగా కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాంకర్లకు సర్కారు నుంచి సూచనలు అందాయి. పూర్తి స్థాయిలో నియమ నిబంధనలు రాకపోవడంతో అధికారులు వేచి చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement