మంచిర్యాలటౌన్: మారుతున్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంతో జిల్లాలో బీపీ, షుగర్ వ్యాధిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న నాన్ కమ్యూనికేబుల్ డీసీజెస్ (ఎన్‌సీడీ) సర్వేలో బీపీ, షుగర్ బారిన పడినవారు బయటపడుతున్నారు. జిల్లాలో 30 ఏళ్లకు పైబడిన వారే వ్యాధుల బారిన పడుతున్నట్లు సర్వేలో బయటపడుతోంది. వ్యా యామం చేసేందుకు తగిన సమయం లేకపోవడం, ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సమయానికి సరైన ఆహారం తీసుకోక పోవడం, మానసిక ఒత్తిడికి గురికావడం, సరైన నిద్ర, తగిన విశ్రాంతి లేకపోవడంతో వ్యాధులు ప్రబలేందుకు కారణం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే బీపీ, షుగర్ ప్రస్తుతం యువతలోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. 30 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపించడం, చిన్న వయస్సులోనే మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా వ్యాధుల బారిన పడుతున్నట్లు సర్వేలో గుర్తిస్తున్నారు. బీపీ, షుగర్ బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆయా వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒకసారి ఈ వ్యాధులు దరిచేరితే, వాటిని అదుపులో ఉంచేందుకు జీవితాంతం మందులు వాడడంతో పాటు, సరైన వ్యాయామం, ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
సర్వేలో వ్యాధుల గుర్తింపు
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్‌సీడీ సర్వేలో మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన ఎంతమంది పడుతున్నారో తెలుసుకుంటున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు.. ఇలా అన్నింటిలోనూ బీపీ, షుగర్ పరీక్షలు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8,09,000 మంది జనాభా ఉండగా, 30 ఏళ్లు పైబడిన వారు 4,20,680 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు 2,86,149 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, మధుమేహం ఉన్నవారు 29,058 మంది, రక్తపోటు (బీపీ) ఉన్నవారు 73,664 మంది ఉన్నట్లు గుర్తించి, వారికి వైద్యంతో పాటు అవసరమైన మందులు అందిస్తున్నారు. వారి వివరాలను వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసి ఎన్‌సీడీ కార్డు ఇస్తున్నారు. ఎన్‌సీడీ కార్డులో పేషెంట్ పేరు, అందిస్తున్న చికిత్స, మందుల వివరాలు పొందుపర్చి, ప్రతీనెల ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా వారికి మందులు అందిస్తున్నారు. వీటితో పాటు ఓరల్ క్యాన్సర్ కేసులు 25, బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 46, సర్వైకల్ క్యాన్సర్ కేసులు 12 ఉన్నట్లు నిర్ధారించారు.


