ఫార్మర్‌ రిజిస్ట్రీకి ప్రత్యేక సదస్సులు | - | Sakshi
Sakshi News home page

ఫార్మర్‌ రిజిస్ట్రీకి ప్రత్యేక సదస్సులు

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

● ఈ నెల 22 నుంచి 30 వరకు నిర్వహణ ● జిల్లాలో ఇప్పటి వరకు 77 శాతం నమోదు

దండేపల్లి: రైతులకు 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డును జారీ చేసే ప్రక్రియను ‘రైతు రిజిస్ట్రేషన్‌’ (ఫార్మర్‌ ఐడీ) పేరిట వ్యవసాయ శాఖ చేపట్టి ఏడాది దాటింది. ప్రాధాన్యం గల ఈ ప్రక్రి య ఇప్పటి వరకు జిల్లాలో 77 శాతం మాత్రమే పూర్తయింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 22 నుంచి 30 వరకు గ్రామాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించి రైతులను ఈదిశగా చైతన్యపరుస్తూ నమోదును పెంచాలని నిర్ణయించింది. ఆయా వ్యవసాయ క్లస్టర్లలో వ్యవసాయ విస్తరణాధికారులు రైతు రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉంటుంది. మండల వ్యవసాయాధికారులు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.

కార్డు ప్రాధాన్యంపై అవగాహన

ఈ కార్డుతో కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కనీస మద్దతు ధరలకు పంటల విక్రయం, యాప్‌ ద్వారా ఎరువుల కొనుగోళ్లు, బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సేవలు ఇతర ప్రయోజనాలు పొందేందుకు, రైతు సేవలు, రాయితీలు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలకు ఈ విశిష్ట గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని వివరించాల్సి ఉంటుంది.

పారదర్శకత

రైతుల వివరాలు కచ్చితంగా నమోదైతే పారదర్శకత పెరుగుతుంది. ఒకే ఐడీతో లబ్ధి నేరుగా బ్యాంక్‌ ఖాతాలోకి వస్తుంది. భవిష్యత్‌ పథకాల ప్రయోజనాలు సులభం, స్పష్టమైన గుర్తింపుతో మోసాలు తగ్గుతాయి. నమోదు పూర్తయ్యాక ‘యూనిక్‌ ఐడీ’ని అందజేస్తారు.

నమోదుకు అవసరమైనవి

ఆధార్‌ కార్డు నంబర్‌, భూమిపాస్‌ బుక్‌ వివరాలు ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న ఫోన్‌నంబర్‌తో రైతు వేదికల్లో ఏఈవోల వద్ద ఉచితంగా చేయించుకోవచ్చు. లేదంటే మీసేవ కేంద్రాల్లో చేయించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement