దండేపల్లి/పాతమంచిర్యాల/నెన్నెల: రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాలుగేళ్ల తర్వాత పింఛన్ల కోసం ఇటీవల దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుల గడువు ముగియడంతో వెంటనే వాటి విచారణ ప్రారంభించింది. ఈ నెల 25 వరకు పరిశీలన పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. సమయం చాలక పరిశీలన పూర్తికాక పోవడంతో ఈ నెలాఖరు వరకు గడువు పొడగించారు. జిల్లాలోని 16 మండలాలు, 5 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌తో సహా, వివిధ కేటగిరీలలో మొత్తం 13,744 దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలనకు జిల్లా వ్యాప్తంగా 143 మంది అధికారులను నియమించారు.
ఐదు విభాగాల్లో పరిశీలన
జిల్లా వ్యాప్తంగా 13,744 మంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో అత్యధికంగా వితంతు, దివ్యాంగ పింఛన్ల కోసం దరఖాస్తులు వచ్చా యి. వీటిని అధికారులు ఐదు కేటగిరీల్లో పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన 360 డిగ్రీల మొబైల్ యాప్‌లో మొత్తం 12 ప్రశ్నలను నమోదు చేయడంతో పాటు, దరఖాస్తులు పరిశీలించనున్నారు. 7.5 ఎకరాల కంటే ఎక్కువగా మెట్ట, మూడెకరాల కంటే ఎక్కువగా నీటి ఆధారిత పంటల సాగుభూములు ఉండరాదని, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల ఆదాయం ఉండాలి. ఒంటరి మహిళల విషయంలో సంబంధిత పత్రాలను, కల్లుగీత, చేనేత కార్మికులకు గుర్తింపు కార్డు పరిశీలనలోకి తీసుకుంటారు. మొబైల్ యాప్ ద్వారా చేయూత దరఖాస్తుదారుడి వివరాలు పక్కాగా పరిశీలిస్తోంది. ఆధార్ అనుసంధానం కావడంతో అర్హులా? కాదా? అనే నిర్ధారణ జరుగుతోంది. మధ్యవర్తులను నమ్మి ఎవరూ పైరవీలు చేయరాదని అధికారులు సూచిస్తున్నారు. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్న నేపథ్యంలో ప్రతీ దరఖాస్తును, దానికి జతచేసిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అదనంగా అవసరమైన పత్రాలను వారి వద్ద నుంచి తీసుకొని విచారణ పూర్తి చేస్తున్నారు.
విచారణ అధికారులదే బాధ్యత
పింఛన్‌కు అర్హులను ఎంపిక చేశాక ఇందులో ఎవరైనా అనర్హులని తేలితే క్షేత్రస్థాయి పరిశీలన అధికారులనే బాధ్యులను చేయనున్నారు. లబ్ధిదారులకు పింఛన్ రూపంలో చెల్లించిన మొత్తాన్ని అధికారి నుంచి రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. దీంతో పరిశీలన అధికారులు అర్హుల ఎంపికను పకడ్బందీగా నిర్వహించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అర్హతకు సంబంధించిన ధ్రువపత్రాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
జిల్లాలో పింఛన్
దరఖాస్తుల వివరాలు
వితంతు 7,859
ఒంటరి మహిళ 1,790
దివ్యాంగులు 3,337
నేత కార్మికులు 294
కల్లు గీత కార్మికులు 464


