పంజా విసురుతున్న డెంగీ | - | Sakshi
Sakshi News home page

పంజా విసురుతున్న డెంగీ

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

జన్నారం మండలంలో 50కి పైగా కేసులు

పరిశుభ్రతపై దృష్టి సారించని అధికారులు

జన్నారం మండలం పొనకల్‌కు చెందిన సాయికృష్ణ భార్య, తమ్ముడు జ్వరం బారిన పడ్డారు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా డెంగీ పాజిటివ్‌ అని రిపోర్టు వచ్చింది. భయంతో మంచిర్యాల ఆసుపత్రికి వెళ్లి నాలుగు రోజులుగా చికిత్స చేయించుకున్నాక తగ్గినట్లు తెలిపారు.

జన్నారం మండలం మురిమడుగుకు చెందిన శ్రీనివాస్‌కు పదిహేను రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో జన్నారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా డెంగీ పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రక్త కణాలు 40 వేలకు పడిపోయాయని చెప్పడంతో వెంటనే మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నాలుగు రోజులు చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత అతని భార్య, కుమారుడు కూడా జ్వరం బారిన పడ్డారు.

జన్నారం: మండలంలో డెంగీ జ్వరాలు భయాందోళన కలిగిస్తున్నాయి. పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడం, మురుగునీరు నిల్వ ఉండడం, దోమల బెడద తీవ్రం కావడంతో వందలాది మంది జ్వరాల బారిన పడుతున్నారు. రెండు నెలల కాలంలో మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 50కి పైగా ప్రజలు డెంగీ బారిన పడినట్లు తెలుస్తోంది.

అపరిశుభ్రత..దోమల వ్యాప్తి

గ్రామాల్లోని వీధులు, డ్రెయినేజీల్లో మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మురుగు కుంటలు, నిలిచిపోయిన వాననీరు దోమలకు ఆవాసాలుగా మారి డెంగీ, టైఫాయిడ్‌ వంటి జ్వరాలు ప్రబలడానికి ప్రధాన కారణమవుతున్నాయి. జన్నారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంతో పాటు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రులు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. పల్లెల్లో ఇంటికి ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పీహెచ్‌సీల్లో తగినన్ని మందులు, వైద్య సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామాలు, తండాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, దోమల నివారణకు ఫాగింగ్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ పిచికారీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement