సగం మందికే సీఎంపీఎఫ్‌ | - | Sakshi
Sakshi News home page

సగం మందికే సీఎంపీఎఫ్‌

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

● కాంట్రాక్ట్‌ కార్మికులకు తప్పని తిప్పలు ● అమలైనవారికి లెక్కలు చెప్పని అధికారులు ● రికవరీ కానివారిని పట్టించుకోరు..

శ్రీరాంపూర్‌: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కంపెనీ ఉత్పత్తి లక్ష్యసాధన, సంక్షేమ కార్యక్రమాల్లో సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు సీఎంపీఎఫ్‌ అమలు, సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కంపెనీ వ్యాప్తంగా సివిల్‌ నిర్మాణాలు, సివిక్‌, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, హౌజ్‌కీపింగ్‌, రోడ్‌ స్వీపింగ్‌, సీహెచ్‌పీలో సేల్‌పికింగ్‌, బెల్ట్‌ క్లీనింగ్‌, నర్సరీ, హాస్పిటల్స్‌, భూగర్భంతో పాటు ఉపరితలాల్లోని అనేక డిపార్టుమెంటుల్లో 28 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనులు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కంపెనీలో పనిచేసే ప్రతీ కార్మికునికి కోల్‌ మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (సీఎంపీఎఫ్‌) తప్పనిసరిగా అమలు చేయాలి. కానీ వీరిలో కేవలం 12 వేల మందికి మాత్రమే సీఎంపీఎఫ్‌ అమలవుతోంది. టెండర్‌ షెడ్యూల్‌లో కార్మికులకు సీఎంపీఎఫ్‌ అమలు చేయాలనే నిబంధన పెట్ట కపోవడంతో ఈ సమస్య ఉత్పన్నం అవుతోంది.

నాలుగేళ్లుగా లెక్కల్లేవ్‌..

ప్రతీనెల కాంట్రాక్ట్‌ కార్మికుని నెల బేసిక్‌ వేతనం నుంచి 12 శాతం రికవరీ చేసి అంతే మొత్తం కంపెనీ కాంట్రాక్టర్‌ నుంచి సీఎంపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తుంది. ఇలా జమ అయిన డబ్బులకు ఆశాఖ వడ్డీ కలిపి ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పటి వరకు కంపెనీ వ్యాప్తంగా సుమారు 12 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు సీఎంపీఎఫ్‌ అమలవుతోంది. కానీ వారికి ఖాతాలో ఎంత మొత్తం జమ అయ్యిందో ఆ శాఖ అధికారులు లెక్కలు చెప్పడం లేదు. గతంలో ఏడాది ముగిసాక జమ వివరాలను చీటీల రూపంలో అందించే వారు. ఇప్పుడు ఆ శాఖలో ఉన్న ఖాతాలను ఆన్‌లైన్‌ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ఇప్పటికీ ఎక్కువ మొత్తం ఖాతాలు ఆన్‌లైన్‌ కాలేదని కార్మికులు వాపోతున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి సీఎంపీఎఫ్‌ జమ లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జమ లెక్కలు చెప్పాలి

ప్రతీ కాంట్రాక్ట్‌ కార్మికుడికి సీఎంపీఎఫ్‌ అమలు చేయాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. రికవరీ అయిన వారికి ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో చెప్పడంలేదు. ప్రతీ కాంట్రాక్ట్‌ కార్మికునికి సీఎంపీఎఫ్‌ అమలు చేసి జమ లెక్కలు చెప్పాలి. – డీ.బ్రహ్మానందం,

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎస్సీసీడబ్ల్యూ

సీఎంపీఎఫ్‌ అమలు చేయాలి

12 సంవత్సరాలుగా నర్సరీలో పని చేస్తు న్నా. ఇప్పటి వరకు సీఎంపీఎఫ్‌ కడుతలేరు. కాంట్రాక్టర్లను అడిగితే అధికారులను అడుగాలంటున్నారు. వారిని అడిగితే ఇదిగో అయిపోతుందంటూ దాటవేస్తున్నారు. ఇప్పటికై నా సీఎంపీఎఫ్‌ అమలు చేయాలి.

– పీ.లక్ష్మి, నర్సరీ కార్మికురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement