సర్కారు బడుల్లో ‘స్వచ్ఛ’ శోభ | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో ‘స్వచ్ఛ’ శోభ

Aug 16 2026 12:09 AM | Updated on Aug 16 2026 12:09 AM

● క్లీన్‌ బడి.. గ్రీన్‌ బడిపై ప్రత్యేక దృష్టి ● పాఠశాల వసతుల గ్రాంట్‌ పునరుద్ధరణ

మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, స్కావెంజర్లు, పార్ట్‌టైం వర్కర్ల సర్ధుబాటుపై పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. శుభ్రత, పరిశుభ్రత పర్యవేక్షణ కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మంజూరు చేసే పాఠశాల వసతుల నిర్వహణ గ్రాంట్‌ (స్కూల్‌ ఫెసిలిటీ మెయింటెన్స్‌ గ్రాంటు (ఎస్‌ఎఫ్‌ఎంజీ) నిబంధనల్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో (ఏప్రిలో 23, 2026 నాటి మెమో ప్రకారం) పార్ట్‌ టైమ్‌ స్వీపర్లు పనిచేస్తున్న పాఠశాలలకు నిధులు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. నిధులు సక్రమంగా వినియోగించేందుకు మార్గదర్శకాలు సవరించారు. ఒకేపనికి రెండుసార్లు (పార్ట్‌టైం వర్కర్లు ఉన్నచోట) నిధులు ఖర్చు కాకుండా చూడటం ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. అయితే ఖర్చుల పునరావృతాన్ని నియంత్రిస్తూనే నిధులు సక్రమంగా వినియోగించుకునేలా ఈనెల 14న సవరించిన నిబంధనలు అమలులోకి తెచ్చింది.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా..

జిల్లాలోని 688 పాఠశాలల్లో 636 మంది సర్వీసు మ్యాన్‌, దాదాపు 52 మంది పార్ట్‌టైం వర్కర్లు పని చేస్తున్నారు. పార్ట్‌ టైం వర్కర్లకు నెలకు రూ.5,200 చెల్లిస్తూ వస్తున్నారు. ఇటీవల పాఠశాల శుభ్రతకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా 636 సర్వీసు మ్యాన్‌లను (స్కావెంజర్లు) నియమించారు. ఎన్‌రోల్‌మెంట్‌కు అనుగుణంగా 10 నెలల పాటు వేతనాలు చెల్లిస్తున్నారు. పార్ట్‌టైం వర్కర్లు ఉన్న బడులకు ఎస్‌ఎఫ్‌ఎంజీ గ్రాంటును పూర్తిగా నిలిపివేయాలని ఏప్రిల్‌లో జారీ అయిన ఉత్తర్వులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల 14న తాజాగా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ సవరించిన నిధులు విడుదల చేశారు. 30 మంది వరకు విద్యార్థులు ఉన్న స్కూళ్లకు సాధారణంగా నెలకు రూ.3వేలు ఇస్తుండగా స్వీపర్‌ ఉన్న చోట గ్రాంట్‌ నిలిపివేయనున్నారు. 31 నుంచి ఆపైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా గ్రాంట్లు విడుదల చేశారు.

పనులు, నిధులు

స్కూల్‌ పరిసరాల పరిశుభ్రత, టాయిలెట్ల క్లీనింగ్‌, మొక్కలకు నీళ్లు పోసేందుకు నిధులు వినియోగించాలని ఆదేశించారు. వేతన వెతలు..

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లు (సర్వీసు మ్యాన్‌)లకు రెండు నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారింది. అరకొరగా ఇచ్చే వేతనాలు సమయానికి రాకపోవటంతో అవస్థలు పడుతున్నారు. కొందరు విధులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రతినెలా వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.

పార్ట్‌ టైమ్‌ స్వీపర్లు ఉన్న పాఠశాలలకు

ఎస్‌ఎఫ్‌ఎంజీ నెలవారీ గ్రాంట్‌ వివరాలు

విద్యార్థుల సంఖ్య ఎస్‌ఎఫ్‌ఎంజీ పార్ట్‌టైం స్వీపర్లు ఉన్న

పాఠశాలలకు గ్రాంట్‌

1 నుంచి 30 వరకు రూ.3వేలు నో గ్రాంటు

31 నుంచి 100 వరకు రూ.6 వేలు రూ.3 వేలు

101 నుంచి 250 వరకు రూ.8 వేలు రూ.6 వేలు

251 నుంచి 500 వరకు రూ.12 వేలు రూ.9 వేలు

501 నుంచి 750 వరకు రూ.15 వేలు రూ.12 వేలు

750 కంటే ఎక్కువ రూ.20 వేలు రూ.15 వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement