జిల్లాలో సీజనల్ వ్యాధులు టైఫాయిడ్, డయేరియా వర్షాలు తగ్గి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇబ్బందులు నిల్వ నీటిని తొలగించకపోవడంతో రోగాలు
మంచిర్యాలటౌన్: జిల్లాలో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రతీ ఇంట్లో ఒకరు జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. దగ్గు, జలుబు, గొంతనొప్పి కేసుల సంఖ్య తోడవుతోంది. గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతున్నాయి. చర్మవ్యాధులు వస్తున్నాయి. టైఫాయిడ్, డయేరియా కేసులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీటిలో చెత్తాచెదారం, వ్యర్థాలు కొట్టుకువచ్చి ఖాళీ స్థలాల్లో పేరుకుపోయాయి. ప్రస్తుతం ఎండలు కొడుతున్నా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. మురుగు నీటిలో కలిసిన చెత్త కుళ్లిపోవడం వల్ల అపరిశుభ్రతగా మారి పరిసరాలు కలుషితం అవుతున్నాయి. వైరల్ జ్వరాలతోపాటు డయేరియా, టైఫాయిడ్ కేసుల నమోదుతో అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ గ్రామీణ ప్రాంతాలతోపాటు మున్సిపాల్టీల్లోని వార్డులు, డివిజన్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తూ మందులు పంపిణీ చేస్తోంది. టైఫాయిడ్, వైరల్ జ్వరాలు, డయేరియా కేసులు నమోదువుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్యం మెరుగుపర్చి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల లెక్క తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులూ రోగులతో కిటకిటలాడుతుండగా వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న డయేరియా కేసులు
అపరిశుభ్రత, కలుషిత నీటి వల్ల డయేరియా(అతిసార) ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కలుషిత నీటిని తాగడం, ఈగలు వాలిన ఆహార పదార్థాలను తినడం, వాతావరణం కలుషితం వల్ల వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి అతిసార బారిన పడుతున్నారు. జీర్ణ వ్యవస్థ పనితీరు అస్తవ్యస్తమై వాంతులు, విరేచనాలు అవుతాయి. శరీరం నుంచి అధిక మొత్తంలో నీరు బయటకు వెళ్లిపోతే డీహైడ్రేషన్ ఏర్పడి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లలు, వృద్ధులకు ఎక్కువ ప్రమాదం. సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది.


