మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పంద్రాగస్టు నాటికే యూనిఫాం అందించాలని విద్యాశాఖ నిర్ణయించినా వస్త్రం సరఫరాలో తీవ్ర ఆలస్యం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందే శుక్రవారం చేరగా.. కుట్టుపని పూర్తికాకపోవడంతో పాతదుస్తులతోనే జెండా పండుగకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎ ట్టకేలకు యూనిఫామ్ క్లాత్(ముడివస్త్రం) మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేరింది. కుట్టడం కోసం అక్కడి నుంచి మహిళా స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేస్తున్నారు. యూనిఫాం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పంపిణీ చేయాలని భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. వీలైనంత త్వరగా విద్యార్థుల చేతికి అందించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు.
పంపిణీపై అస్పష్టత
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు అందించే యూనిఫామ్‌లపై అస్పష్టత నెలకొంది. ఈ ఏడాది ఆలస్యంతో ఇప్పటికిప్పుడు రెండు జతలు అందిస్తారా లేదా ఒక్కదాంతోనే సరిపెడుతారా అనేది తెలి యాల్సి ఉంది. మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ నుంచి నేరుగా దుస్తుల క్లాత్ మూటలు ఆయా ఎమ్మార్సీలకు చేరడంతో ఎంత క్లాత్ వచ్చిందో స్పష్టత లేకుండా పోయింది. 709 ప్రభుత్వ పాఠశాలల్లోని 39,860 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున అందించాల్సి ఉంది. యూనిఫామ్‌ల క్లాత్ ప్రతీయేడాది వేసవి సెలవుల్లో రావడం వల్ల ఎంఈవోలు ఐకేపీ మహిళా సంఘాలతో చర్చించి యూనిఫామ్‌లు కు ట్టించేవారు. ప్రస్తుతం ఆలస్యం కావడంతో హడావుడిగా అప్పగించడం వల్ల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదివరకు చొక్కాలు ఎగుడు దిగుడు, మిషన్ పెద్దకుట్టు, నాసిరకం గుండీల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తరగతి గదికి వెళ్లి విద్యార్థుల కొలతలు తీసుకుంటారా? లేదా గంపగుత్తగా అనేది తేలాల్సి ఉంది. అసలే ఆలస్యమైనా యూనిఫామ్‌లు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సరైన కొలతల్లో కుట్టాలని పలువురు కోరుతున్నారు.
మహిళా సంఘాలకు పంపిణీ
ఏకరూప దుస్తులు కుట్టేందుకు అవసరమైన వస్త్రా న్ని ఎమ్మార్సీలకు తరలించారు. పాఠశాలల వారీగా వస్త్ర మూటలను తరలించకుండా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్(ఏపీఎం) ద్వారా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తున్నారు. సరఫరా ఆలస్యం కావడంతో ఇన్నాళ్లు నిలి చిపోయిన కుట్టుపనులు వేగవంతానికి అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు తగినట్లుగా పక్కా కొలతలతో యూనిఫామ్‌లు కుట్టాలని ఆదేశించారు. జిల్లాలోని 342 స్వయం సహాయక సంఘాల మహిళలకు దుస్తులు కుట్టే బాధ్యతలు అప్పగించి వారంలోనే ఒక్కో జత అయినా అందజేయాలని సూచిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుబాల్లోని పిల్లల్లో అసమానతలను తొలగించేందుకు ఉచిత యూనిఫామ్‌లను వీలైనంత త్వరగా అందిస్తేనే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.


